సుదూర లక్ష్యాన్ని చేధించే క్రూయిజ్ క్షిపణిని పరీక్షించినట్టు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. జపాన్ ను, అమెరికాను కూడా ఈ మిసైల్స్ టార్గెట్ చేయగలవని విశ్లేషకులు చెబుతున్నారు. సుమారు 1500 కిలోమీటర్ల దూరం వరకు ఆ క్షిపణి ప్రయాణించగలదని నార్త్ కొరియా మీడియా తెలిపింది. లాంచ్ వెహికిల్ నుంచి మిస్సైల్‌ను పరీక్షించినట్లు ఉత్తర కొరియాకు చెందిన రొడాంగ్ సిన్మన్ పత్రిక ఓ ఫోటోను ప్రచురించింది. శని, ఆదివారాల్లో మిస్సైల్ పరీక్షలు జరిగినట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు అని విశ్లేషకులు తెలిపారు. ఉత్తర కొరియా తాజా పరీక్షల పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు అమెరికా మిలిటరీ తెలిపింది. క్రూయిజ్ మిస్సైళ్ల కన్నా బాలెస్టిక్ మిస్సైళ్లతో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని యూఎన్ భద్రతా మండలి తెలిపింది.
ఉత్తర కొరియా తన సైనిక కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా క్షిపణులను పరీక్షించి పొరుగు దేశాలు, అంతర్జాతీయ సమాజాన్ని బెదిరింపులకు గురిచేసే ప్రయత్నాలపై దృష్టి సారించిందని యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయోగ స్థానం నుంచి క్షిపణి 1,500 కిలోమీటర్ల ప్రయోగించి ఉత్తర కొరియా ప్రదేశిక జలాలు దాటి లక్ష్యాన్ని చేరుకుందని.. 'గొప్ప ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక ఆయుధం' పరీక్షలు విజయవంతమయ్యాయని, ఇది శత్రు మూకలను నిరోధించే మరో ప్రభావవంతమైన ఆయధం అని ఉత్తర కొరియా ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రయోగానికి కిమ్ హాజరు కాలేదని తెలుస్తోంది. ఈ పరీక్షను జాగ్రత్తగా పరిశీలించి అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలతో కలిసి విశ్లేషిస్తామని దక్షిణ కొరియా ప్రతినిధులు తెలిపారు.