పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆఫ్ఘన్ ప్రజలు

Taliban fire shots to disperse anti-Pakistan rally in Kabul. ఆఫ్ఘ‌నిస్తాన్ వ్య‌వ‌హారంలో పాకిస్తాన్ వేలు పెట్టడం ఆఫ్ఘన్ ప్రజలకు అసలు నచ్చడం లేదు.

By Medi Samrat  Published on  7 Sept 2021 3:22 PM IST
పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆఫ్ఘన్ ప్రజలు

ఆఫ్ఘ‌నిస్తాన్ వ్య‌వ‌హారంలో పాకిస్తాన్ వేలు పెట్టడం ఆఫ్ఘన్ ప్రజలకు అసలు నచ్చడం లేదు. పాక్ కు వ్యతిరేకంగా కాబూల్‌లో భారీ నిరసన ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. అయితే ఆ నిర‌స‌నకారుల‌పై తాలిబ‌న్లు కాల్పుల‌కు దిగారు. యాంటీ-పాకిస్థాన్ ర్యాలీని చెద‌ర‌గొట్టేందుకు తాలిబాన్లు కాల్పులు జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. వందల్లో ఈ నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నారు. దాంట్లో ఎక్కువ శాతం మంది మ‌హిళ‌లే ఉన్నారు. కాబూల్‌లో ఉన్న పాకిస్తానీ ఎంబ‌సీ ముందు ఈ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. కాబూల్‌లో పాకిస్తాన్ వ్యతిరేక ర్యాలీని చెదరగొట్టడానికి తాలిబాన్లు గాలిలో కాల్పులు జరిపారు. కాబూల్ లోని రాష్ట్రపతి భవనం సమీపంలో గుమిగూడిన నిరసనకారులపై తాలిబన్లు కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి.

ఆఫ్ఘన్ ప్రజల్లో కోపం తారాస్థాయికి వెళ్లడంతో నిరసనకారులు "ఆజాది, ఆజాది" అంటూ "పాకిస్తాన్‌కు మరణం", "ISI కి మరణం" అని నినాదాలు చేశారు. బుర్ఖాలు ధరించిన మహిళలు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాబూల్ వీధుల్లోకి వచ్చారు. కాబూల్, మజారీ షరీఫ్ నగరాల్లో మహిళలు సహా పెద్ద ఎత్తున ఆఫ్ఘన్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అహ్మద్ మసూద్ నేతృత్వంలోని ప్రతిఘటన దళాలకు ఆఫ్ఘన్ ప్రజలు మద్దతుగా నిలిచారు. పంజ్ షీర్ కే తమ మద్దతు అని, తమకు స్వేచ్ఛ కావాలని నినాదాలు చేశారు.''తాలిబాన్లకు మరణ శిక్ష.. ఆఫ్ఘనిస్తాన్ జిందాబాద్'' అంటూ నినాదాలతో హోరెత్తించారు.తాలిబాన్లకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్లందరూ గళం విప్పాల్సిన సమయం వచ్చిందని అహ్మద్ మసూద్ సందేశం ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆఫ్ఘన్లు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. సోమవారం తాలిబాన్లు పంజ్‌షీర్ లోయను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.. అయితే ఇది అబద్ధమని తాలిబాన్‌లకు వ్యతిరేకంగా ప్రతిఘటన దళాలు తీవ్ర పోరాటం చేస్తున్నాయని తెలుస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తాలిబాన్లకు మద్దతు ఇస్తూ వస్తోంది.


Next Story