న్యూజిలాండ్‌లో కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,454 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌లో 2,568 కొత్త కమ్యూనిటీ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదనంగా న్యూజిలాండ్ సరిహద్దులో 124 కొత్త కొవిడ్ కేసులు కనుగొనబడ్డాయని తెలిపింది. ప్రస్తుతం, న్యూజిలాండ్ ఆసుపత్రులలో 481 మంది కోవిడ్-19 రోగులు చికిత్స పొందుతున్నారు.
వీరిలో 14 మంది ఐసీయూ(ఇంటెన్సివ్ కేర్ యూనిట్), హై డిపెండెన్సీ యూనిట్లలో ఉన్నారు. తాజాగా మరో 24 కొవిడ్ మరణాలు నమోదయినట్లు మంత్రిత్వ శాఖ నివేదించింది. ఇప్పటివరకూ న్యూజిలాండ్ లో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 9,57,799 కు చేరినట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు. న్యూజిలాండ్ లో ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. మహమ్మారి కారణంగా మార్చి 2020లో అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసిన తర్వాత.. ఆదివారం అర్ధరాత్రి నుండి న్యూజిలాండ్ సరిహద్దులు మొదటిసారిగా తెరవబడ్డాయి.