భారత్ కు వ్యతిరేకంగా షాకింగ్ నిర్ణయం తీసుకున్న న్యూయార్క్ అసెంబ్లీభారతదేశంలో కాశ్మీర్ ఒక భూభాగం.. పాకిస్థాన్ ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోడానికి చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ వస్తోంది. భారత భూభాగం విషయంలో ఇతర దేశాలు తలదూరిస్తే మాత్రం భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోంది. తాజాగా అమెరికా భారత్ కు వ్యతిరేకంగా ప్రకటన చేసింది. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం చేసింది. ఫిబ్రవరి 5వ తేదీని 'కశ్మీర్ అమెరికన్ డే'గా ప్రకటించాలని తీర్మానం చేసింది. న్యూయార్క్ అసెంబ్లీ సభ్యుడు నాదర్ సయేగ్ మరో 12 మంది సభ్యులు కలిసి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. న్యూయార్క్ లోని వలసవాదుల్లో కశ్మీర్ సమాజం ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందని.. కశ్మీరీ ప్రజలకు భావ వ్యక్తీకరణ, మత స్వేచ్ఛను కల్పించడానికి న్యూయార్క్ ప్రయత్నిస్తుందని తెలిపారు. ఈ తీర్మానంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాలో భారత దౌత్య కార్యాలయం ప్రతినిధి మాటాడుతూ.. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో కశ్మీర్ ఒక అంతర్భాగమని.. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. జమ్మూకశ్మీర్ సంస్కృతిని, సామాజిక స్థితిని తప్పుగా చూపించేందుకు, ప్రజలను విడదీసేందుకు స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయత్నమే ఇదని విమర్శించారు.