కొత్త రకం కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది ఇదే..!

Mutant Virus May Be Present In Many Nations. కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా

By Medi Samrat  Published on  22 Dec 2020 10:15 AM GMT
కొత్త రకం కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది ఇదే..!

కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ప్రస్తుతం వ్యాప్తిస్తున్న కరోనా వైరస్ కొత్తదని తేలింది. దీంతో ఈ తరహా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో పలు యూరప్ దేశాలు అప్రమత్తయ్యాయి. కరోనా కొత్తరకం వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో లండన్ లో లాక్ డౌన్ విధించారు. ఈ నూతన రకం వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ కొత్త రకం కరోనా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వైరస్ ప్రపంచమంతా ఇప్పటికే వ్యాపించి వుంటుందని.. ఈ వైరస్ గత సంవత్సరం వెలుగు చూసిన కరోనా వైరస్ కన్నా 70 శాతం అధిక ప్రభావవంతమైనదని చెప్పడానికి ఆధారాలు లేవని అన్నారు. ప్రాథమిక సమాచారం పరిస్థితి అంత తీవ్రంగా ఉండక పోవచ్చని అభిప్రాయపడ్డారు. జీనోమ్ సీక్వెన్సింగ్ పై పరిశోధనలు చేయడంతోనే యూకేలో ఈ విషయం తెలిసిందని ఆమె అన్నారు. ఎన్నో దేశాలు ఇంకా పరిశీలించలేదని తెలుస్తోందని ఆమె చెప్పారు. ఒకవేళ పరిశీలించి వుంటే, జన్యుక్రమాన్ని మార్చుకున్న వైరస్ అక్కడ కూడా కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కొత్త వైరస్ పై మరిన్ని పరిశోధనలు చేయాల్సి వుందని అన్నారు. కరోనా ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనే వ్యాక్సిన్ ను తయారు చేసేందుకు ఈ పరిశోధనలు ఉపకరిస్తాయని తెలిపారు.

Advertisement

బ్రిటన్ లో కొత్త రూపు సంతరించుకుని అతివేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. కరోనా వైరస్ రూపాంతరం చెందడంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని, సమగ్ర సమాచారం వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. బ్రిటన్ లో నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్నామని, అక్కడి అధికారులు కొత్త రకం కరోనా వైరస్ పై జరుగుతున్న పరిశోధనలు, విశ్లేషణ వివరాలను తమతో పంచుకుంటున్నారని వెల్లడించింది.


Next Story
Share it