పాలస్తీనాలో భారత ప్రతినిధి ముకుల్ ఆర్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆదివారం నాడు రమల్లాలోని ఇండియన్ ఎంబసీలో ఆయన శవమై కనిపించారు. 2008 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి ఆర్య ఎలా చనిపోయాడో వెంటనే తెలియరాలేదు. దౌత్యవేత్త మృతి పట్ల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "రమల్లాలో భారత ప్రతినిధి ముకుల్ ఆర్య మరణించిన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను" అని జైశంకర్ ట్వీట్ చేశారు. అతను చాలా తెలివైన, ప్రతిభావంతుడైన అధికారి అని జైశంకర్ అన్నారు.
ముకుల్ ఆర్య తన కార్యాలయంలో మృతి చెందడం పట్ల పాలస్తీనా అగ్ర నాయకత్వం ఆదివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయబారి ఆర్య మరణ వార్తను విని దిగ్భ్రాంతికి లోనయ్యారు. "ఈ బాధాకరమైన వార్త వచ్చిన వెంటనే.. ప్రెసిడెంట్ మహమూద్ అబ్బాస్, ప్రధాన మంత్రి ముహమ్మద్ ష్టయ్య నుండి భారత రాయబారి మరణ కేసును నిశితంగా పరిశీలించేందుకు ఆరోగ్య, ఫోరెన్సిక్ మెడిసిన్ మంత్రిత్వ శాఖతో పాటు అన్ని భద్రత, పోలీసు, ప్రభుత్వ అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేయబడ్డాయి. "రాయబారి ఆర్య మరణం పట్ల విదేశాంగ వ్యవహారాలు, వలసదారుల మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ విచారం, బాధను వ్యక్తం చేస్తోంది" అని అది పేర్కొంది. ఆర్య మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లను పూర్తి చేసేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.