ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. విదేశీ విద్యార్థులందరూ తమ తమ దేశాలకు వెళ్లాలని ఉక్రెయిన్ దేశం ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. ఈ క్రమంలోనే చాలా మంది విదేశీయులు తమ దేశాలకు పయనమయ్యారు. ఇదిలా ఉంటే.. రాజధాని కైవ్ సమీపంలోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన కరీంనగర్‌కు చెందిన ఓ యువతితో సహా 20 మంది భారతీయ విద్యార్థులను తరలించాలని కరీంనగర్ ఎంపీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గురువారం కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో ఎంబీబీఎస్ కోర్సు చదువుతున్న కరీంనగర్‌కు చెందిన కడారి సుమాంజలి అనే విద్యార్థిని కుటుంబ సభ్యులు బండి సంజయ్ కుమార్‌ను సంప్రదించారు. యుద్దం నేపథ్యంలో విదేశీయులంతా దేశాన్ని విడిచి వెళ్లాలయిని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో వీరంతా భారత్ కు వచ్చేందుకు ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకున్నారు. " ఇవాళ విద్యార్థులు విమానాశ్రయానికి చేరుకునే సమయానికి, అధికారులు విమానాశ్రయాన్ని మూసివేశారు.
ఫలితంగా వారందరూ విమానాశ్రయ ప్రాంగణంలో చిక్కుకున్నారు. వారు బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు లేదా విమానాశ్రయంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది" అని ఎంపీ అన్నారు. సంజయ్ కుమార్ లేఖను అనుసరించి, విదేశాంగ మంత్రిత్వ శాఖలోని అధికారులు ఉక్రెయిన్ ప్రభుత్వంతో సంప్రదింపులు ప్రారంభించారు. ఒంటరిగా ఉన్న భారతీయ విద్యార్థులందరూ ఎటువంటి అవాంతరాలు లేకుండా వారి గమ్యస్థానాలకు బయలుదేరేలా చూసేందుకు వీలు కల్పించారు.