చమురుశుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు.. 100 మందికిపైగా సజీవ దహనం
More than 100 killed at Nigerian Oil Refinery Blast.ఓ చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి
By తోట వంశీ కుమార్ Published on 24 April 2022 3:16 AM GMTఓ చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 100 మందికిపైగా సజీవదహనం అయ్యారు. ఈ ఘటన నైజీరియాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఆఫ్రికాలో భారీగా ముడి చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో నైజీరియా ఒకటి. రోజుకు సుమారు రెండు మిలియన్ బ్యారెల్స్ క్రూడాయిల్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. అయితే.. నైజీరియాలో అక్రమంగా ముడి చమురు శుద్ది చేయడం చాలా కామన్. చమురు దొంగలు ముడి చమురును దొంగిలించడానికి పైప్‌లైన్‌లను ధ్వంసం చేసి చమురు దొంగిలిస్తుంటారు. అనంతం దాన్ని శుద్ది చేసి మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ఇలా దొంగిలించి, శుద్ధి చేసే సమయంలో ఇప్పటి వరకు చాలా ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా మరోసారి అలాంటి ఘటననే చోటు చేసుకుంది. దక్షిణ నైజీరియాలోని ఓ అక్రమ చమురు శుద్ధి కర్మాగారంలో శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత నిర్వాహకులు, విక్రేతలు సమావేశం అయ్యారు. అయితే.. ఈ సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వంద మందికిపైగా మృతి చెందగా.. మరింత మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. పంచ్ అనే వార్తా పత్రిక కూడా మృతుల సంఖ్య 100కు పైనే ఉన్నట్లుగా పేర్కొంది.
ఈ ప్రమాదం పై ఇమో స్టేట్ సమాచార కమిషనర్ డెక్లాస్ ఎమెల్యుంబా మాట్లాడుతూ.. ముడి చమురు శుద్ది కేంద్రం వద్ద తొలుత చిన్నగా ప్రారంభమైన మంటలు తరువాత సమీపంలోని రెండు చమురు నిల్వ ప్రాంతాలకు విస్తరించినట్లు చెప్పారు. మృతదేహాలు గురించడానికి వీలులేనంతగా కాలిపోయాయని వెల్లడించారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను ఇంకా లెక్కిస్తున్నట్లు చెప్పారు. చెట్లపైన వేలాడుతున్న మృతదేహాలను చూస్తే.. కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి చెట్లపైకి ఎక్కినట్లు తెలుస్తోందన్నారు. ఇక మృతులంతా అక్రమ ఆపరేటర్లేనని, ప్రమాదానికి కారణమైన చమురు శుద్ది కేంద్రం యజమాని కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.