ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. ఉగ్రవాది మసూద్ అజార్ నేతృత్వంలోని ఈ సంస్థ.. ధ్వంసమైన తన రహస్య స్థావరాన్ని పునరుద్ధరించడానికి, ఉగ్రవాదుల కొత్త రిక్రూట్‌మెంట్, శిక్షణ కోసం నిధులను సేకరించడానికి ప్రయత్నిస్తోంది.
సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ.. జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం జామియా మసీదు సుభాన్ అల్లా పునరుద్ధరణ కోసం రహస్య విరాళాలను కోరింది. ఈ ప్రచారాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పారు.
జైష్-ఎ-మహ్మద్ ప్రధాన కార్యాలయం పాకిస్థాన్‌లోని దక్షిణ పంజాబ్ ప్రావిన్స్‌లో 100 కిలోమీటర్ల దూరంలో బహవల్‌పూర్‌లో ఉంది. దీనిని జామియా మస్జిద్ సుభాన్ అల్లా అని పిలుస్తారు. 2015 నుండి ఉగ్రవాదులకు శిక్షణ మరియు కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. మసూద్ అజార్, అతని కుటుంబ సభ్యులు ఈ స్థలంలో నివసిస్తున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను హతమార్చారు. దీని తరువాత మే 6, 7 అర్ధరాత్రి, భారత్.. పాకిస్తాన్ మరియు గులాం కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఈ దాడిలో ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబానికి చెందిన పలువురు మరణించారు. 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా ఉగ్రదాడితో సహా అనేక ప్రధాన ఉగ్రవాద దాడులతో జైషే మహ్మద్ పేరు ముడిపడి ఉంది. మసూద్ అజార్ 1994లో భారతదేశంలో అరెస్టయ్యాడు. కానీ ఆ తర్వాత విడుదలయ్యాడు.