ప్రకృతి ప్రకోపానికి తుర్కియే(టర్కీ), సిరియా అల్లాడిపోతున్నాయి. భూకంపం కారణంగా ఆ దేశాల్లో ఎటు చూసినా భవన శిథిలాలే కనిపిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భూకంపం సంభవించి ఐదు రోజులు కావడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కుప్పలు తెప్పలుగా మృతదేహాలు బయటపడుతున్నాయి. శనివారం 7 గురిని సహాయ బృందాలు ప్రాణాలతో రక్షించాయి.
హతెయ్ ప్రాంతంలో శిథిలాల కిందున్న ఓ రెండు నెలల చిన్నారిని సహాయక సిబ్బంది రక్షించారు. భూకంపం సంభవించి 128 గంటల గడుస్తున్నా ఆ చిన్నారి శిథిలాల కింద సజీవంగా కనిపించడంతో అక్కడి వారి ఆనందానికి అంతే లేకుండా పోయింది. చిన్నారిని శిథిలాల కింద నుంచి బయటకు తీసుకుని వస్తుండగా అక్కడ ఉన్న స్థానికులు చప్పట్లు కొడుతూ, ఈలలు వేస్తూ సంబరపడిపోతున్నారు.
సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన రెండు భూకంపాలు టర్కీని తీవ్రంగా దెబ్బతీసింది. 6వేలకు పైగా భవనాలు కుప్పకూలాయి. 24,657 మంది మృతి చెందారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అటు సిరియాలో 3,500 మంది ప్రాణాలు కోల్పోయారు.