పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌పై ఆదివారం ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నలుగురు పాక్ పోలీసులు మరణించారు. మరింత మంది గాయపడ్డారు. దక్షిణ వజీరిస్థాన్ గిరిజన జిల్లా సరిహద్దులో ఉన్న లకీ మార్వాట్‌లోని బార్‌గాయ్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు హ్యాండ్ గ్రెనేడ్‌లు, రాకెట్ లాంచర్‌లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఎదురుకాల్పులు చేయగా.. ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. అనుమానితుల ఆచూకీ కోసం భారీగా పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి మెహమూద్ ఖాన్ ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ప్రావిన్షియల్ పోలీసు చీఫ్ నుండి తక్షణ నివేదికను కోరారు. అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ పోలీసు కుటుంబాలకు తన సంతాపాన్ని ప్రకటించారు. ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించే వరకు మా ప్రయత్నాలు కొనసాగుతాయని అన్నారు.