మే 7వ తేదీ తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడి చేసింది. భారత దాడుల్లో మరణించిన అనేక మంది ఉగ్రవాదులలో ముదస్సర్ ఖాదియన్ ఖాస్, హఫీజ్ ముహమ్మద్ జమీల్, మొహమ్మద్ యూసుఫ్ అజార్, ఖలీద్ (అబు ఆకాషా), మొహమ్మద్ హసన్ ఖాన్ ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అంతం చేసిన ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలలోని అత్యంత ఉన్నత స్థాయి వ్యక్తులలో కొందరని తెలుస్తోంది. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్థలతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు.
ముదస్సర్ ఖాదియాన్ ఖాస్ లష్కరే తోయిబాలో సీనియర్. ముదస్సర్ అలియాస్ అబు జుందాల్ అని కూడా పిలుస్తారు. ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం మురిద్కేలోని మర్కజ్ తైబాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అలాంటి తీవ్రవాదికి పాకిస్తాన్ సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ తరపున పుష్పగుచ్ఛాలు ఉంచారు. గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిన హఫీజ్ అబ్దుల్ రవూఫ్ నేతృత్వంలో అంత్యక్రియల ప్రార్థనలు ప్రభుత్వ పాఠశాలలో జరిగాయి.
మసూద్ అజార్ మరో బావమరిది యూసుఫ్ అజార్. అతడిని ఉస్తాద్ జీ, మొహమ్మద్ సలీం అలియాస్ ఘోసి సాహబ్ అని కూడా పిలుస్తారు. జైష్-ఎ-మొహమ్మద్ కార్యకలాపాలలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆయుధ శిక్షణకు బాధ్యత వహించాడు. జమ్మూ కశ్మీర్‌లో అనేక ఉగ్రవాద దాడులలో చురుకుగా పాల్గొన్నాడు. 1999లో మసూద్ అజార్ విడుదలకు దారితీసిన IC-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ హైజాక్ కేసుకు సంబంధించి కూడా అతను వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.