ఈజిప్టు దేశంలోని ఓ చర్చిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. కైరోలోని ఇంబాబా ప్రాంతంలోని చర్చిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. 50 మందికిపైగా గాయపడ్డారని భద్రతా వర్గాలు తెలిపాయి. ఇంబాబా పరిసర ప్రాంతంలోని అబు సిఫిన్ చర్చిలో 5,000 మంది భక్తులు సామూహికంగా ప్రార్థనలు చేస్తుండగా విద్యుత్ మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే అక్కడ తొక్కిసలాట జరిగిందని ఆ దేశ అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలపై విచారణ కొనసాగుతోంది.
భారీగా మంటలు చెలరేగడంతో తొక్కిసలాట జరిగింది. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 ఫైర్ వెహికల్స్‌తో మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. కనీసం 55 మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించామని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇలా జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చర్చిలో అగ్నిప్రమాదంపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిస్సీ విచారం వ్యక్తం చేశారు. కోప్టిక్ క్రిస్టియన్ పోప్ తవాడ్రోస్-2కు ఫోన్ చేసి సంతాపం తెలిపారు.