నిద్రిస్తున్న వ్యక్తి ముక్కులోంచి శ్వాసనాళంలోకి ప్రవేశించిన బొద్దింక.. ఆ తర్వాత
ఇటీవల 58 ఏళ్ల చైనీస్ వ్యక్తి తన శ్వాసనాళంలోకి బొద్దింక ప్రవేశించినట్లు చెప్పాడు.
By Medi Samrat Published on 9 Sep 2024 1:57 PM GMTఇటీవల 58 ఏళ్ల చైనీస్ వ్యక్తి తన శ్వాసనాళంలోకి బొద్దింక ప్రవేశించినట్లు చెప్పాడు. ఈ సంఘటన రాత్రి మనిషి నిద్రిస్తున్నప్పుడు జరిగింది. తన నోట్లో ఏదో పాకుతున్నట్టు వింత అనుభూతితో మెలకువ వచ్చిందని.. ఆశ్చర్యపోయిన అతడు తన గొంతులో నుంచి బయటకు కక్కేందుకు బలంగా దగ్గడం మొదలుపెట్టాడు. కానీ దానిని బయటకు కక్కలేకపోయాడు. తర్వాత మళ్లీ నిద్రపోయాడు.
మరుసటి రోజు అతడు జరిగిన సంఘటనను పట్టించుకోకుండా తన రోజువారీ పనిలో నిమగ్నమయ్యాడు. అయితే, తర్వాతి మూడు రోజుల్లో తన శ్వాసలో అసాధారణంగా దుర్వాసన రావడం గమనించాడు. బ్రష్ చేయడం.. నోరు శుభ్రం చేసుకున్నా కానీ నోటి దుర్వాసన మాత్రం తగ్గలేదు. అతను పసుపు కఫం కూడా కక్కేందుకు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేక చివరకు వైద్య సహాయం తీసుకోవలసి వచ్చింది.
చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌లోని హైకౌ నివాసి అయిన వ్యక్తి.. హైనాన్ ఆసుపత్రికి వెళ్లి ENT స్పెషలిస్ట్ చేత తనిఖీ చేయించుకున్నాడు. అక్కడ ఏమీ కనుగొనలేదు. ఏదో తప్పు జరిగిందని నమ్మి అతడిని శ్వాసకోశ, క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అయిన డాక్టర్ లిన్ లింగ్‌కు రిఫర్ చేశారు. డాక్టర్ లిన్ ఛాతీ CT స్కాన్ చేసాడు. స్కానింగ్‌లో కుడి దిగువ ఊపిరితిత్తుల భాగంలో నీడలా ఒక ఆకారం చూపించడంతో అక్కడ ఒక వస్తువు దాగి ఉందని గుర్తించారు.
ఈ కేసు తదుపరి విచారణ కోసం వ్యక్తి బ్రోంకోస్కోపీ చేయించుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో.. నేను శ్వాసనాళంలో రెక్కలున్న వస్తువును స్పష్టంగా చూశాను. ఆ వస్తువు చాలా శ్లేష్మంతో చుట్టబడి ఉంది అని డాక్టర్ లిన్ చెప్పారు. చుట్టుపక్కల ఉన్న కఫాన్ని తొలగించిన తర్వాత.. అది బొద్దింక అని మేము కనుగొన్నామని పేర్కొన్నారు. రోగి శ్వాసనాళంలో నుండి కీటకాన్ని జాగ్రత్తగా తీసివేసి.. ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. దీంతో రోగి నుంచి వెదజల్లుతున్న దుర్వాసన వెంటనే తగ్గింది. అతను పూర్తిగా కోలుకుని మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యాడు.