అరాచ‌కం.. దైవదూషణ చేశాడనే ఆరోపణపై శ్రీలంక మేనేజ‌ర్ పై దాడి, స‌జీవ ద‌హ‌నం

Man tortured and killed in Pakistan over alleged blasphemy.దైవదూషణన‌కు పాల్పడ్డాడంటూ ఓ శ్రీలంక దేశ‌స్థుడిపై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Dec 2021 9:03 AM IST
అరాచ‌కం.. దైవదూషణ చేశాడనే ఆరోపణపై శ్రీలంక మేనేజ‌ర్ పై దాడి, స‌జీవ ద‌హ‌నం

దైవదూషణకు పాల్పడ్డాడంటూ ఓ శ్రీలంక దేశ‌స్థుడిపై దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. అనంత‌రం బ‌తికిఉండ‌గానే అత‌డిని స‌జీవ ద‌హ‌నం చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌న పొరుగుదేశ‌మైన పాకిస్థాన్‌లో జ‌రిగింది. ఈ ఘ‌ట‌న ఆదేశ వ్యాప్తంగా తీవ్ర‌ప్ర‌కంప‌న‌లు రేపింది. ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర‌స్థాయిలో స్పందించారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌న్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..?

'డాన్.కామ్' కథనం ప్రకారం.. సియోల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్డులో ఉన్న‌ ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమార (40) ఎక్స్‌పోర్టు మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఆయ‌న ప‌ని చేస్తున్న ఫ్యాక్ట‌రీకి చెందిన గోడ‌పై తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) అనే ఇస్లామిస్ట్ పార్టీకి చెందిన పోస్టర్ అంటించి ఉంది. ఆ పోస్ట‌ర్‌పై ఖురాన్ ప‌ద్యాలు ముద్రించి ఉన్నాయి. ఆ విష‌యాన్ని గుర్తించ‌ని ప్రియాంత ఆ పోస్ట‌రును గోడ‌పై నుంచి తొల‌గించి చించి చెత్త బుట్ట‌లో ప‌డ‌వేశారు. దీనిని ఇద్ద‌రు కార్మికులు గ‌మ‌నించి.. మిగ‌తా కార్మికుల‌కు విష‌యాన్ని చెప్పారు.

వారంతా ఆగ్ర‌హాంతో ఊగిపోయారు. వంద‌లాది మంది కార్మికులు గ‌ట్టిగా నినాదాలు చేసుకుంటూ ప్రియాంత కుమార వ‌ద్ద‌కు చేరుకున్నారు. ప్రియాంత దైవ‌దూష‌ణ‌కు పాల్ప‌డ్డారంటూ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తూ.. ఒక్క‌సారిగా అంద‌రూ క‌లిసి అత‌డిపై దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో ప్రియాంత కుమార తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అప్ప‌టికి వారి కోపం చ‌ల్లార‌నే లేదు. కొనఊపిరితో ఉన్న అత‌డిని స‌జీవ‌ద‌హనం చేశారు. ఈ అరాచ‌కాన్ని ఒక్క‌రు కూడా ఆప‌లేదు స‌రిక‌దా.. త‌న ఫోన్ల‌లో ఈ ఘ‌ట‌న మొత్తాన్ని బంధించారు. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై ఆదేశ వ్యాప్తంగా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అయ్యాయి.

దీనిపై ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని భయంకరమైన విజిలెంట్ దాడిగా అభివర్ణించారు. శ్రీలంక మేనేజర్‌ను సజీవ దహనం చేయడం పాకిస్థాన్‌కే తీవ్ర అవమానకరమన్నారు. నిందితుల‌ను వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని వారిని క‌ఠినంగా శిక్షిస్తామ‌ని ట్వీట్ చేశారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాల‌ను ద‌ర్యాప్తు అనంత‌రం వెల్ల‌డిస్తామ‌ని సియోల్‌కోట్ పోలీసు అధికారులు తెలిపారు.

Next Story