స్విట్జర్లాండ్‌లోని ఒక ఫ్యాక్టరీలో కరిగిన అల్యూమినియం నిండిన టబ్‌లో పడి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ టబ్ లోపల ఉష్ణోగ్రత 720 డిగ్రీల సెల్సియస్‌గా ఉందని అధికారులు తెలిపారు. ఓ ఎలక్ట్రీషియన్ ప్రమాదవశాత్తూ పడిపోయాడని పోలీసు అధికారులు ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. ఈ సంఘటన గత వారం బుధవారం జరిగింది. 25 ఏళ్ల వయసున్న ఇద్దరు సభ్యులు కొన్ని పనులను చేపట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒకరు దురదృష్టవశాత్తూ ఆ టబ్ లో పడిపోయారు. ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు, కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన టబ్ ఫొటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
సంఘటన జరిగిన సమయంలో యువకుడు తన సహోద్యోగితో కలిసి పని చేస్తున్నాడు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ ఈశాన్య స్విట్జర్లాండ్‌లోని సెయింట్ గాలెన్‌లో ఉంది. అతని గుర్తింపు వెల్లడి కాలేదు. ఎలక్ట్రీషియన్ తన మోకాళ్ల వరకు అల్యూమినియంలో మునిగిపోయాడని, అయితే అతను తనంతట తాను బయటకు వచ్చేశాడని పోలీసులు ఫేస్‌బుక్‌లో తెలిపారు. యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన కాలిన గాయాలు ఉన్నప్పటికీ, ఎలక్ట్రీషియన్ పూర్తిగా కోలుకుంటున్నాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు, దీని వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కరిగిన అల్యూమినియం "కాలిన గాయాలకు కారణమయ్యే కారకాలలో ఒకటి" అని 2015లో ఒక అధ్యయనం తెలిపింది.