కరోనా కారణంగా ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు ఉండాలని ప్రభుత్వాలు, అధికారులు పదేపదే చెబుతున్నా.. కొందరు మాత్రం పెడచెవిన పెడుతున్నారు. కరోనా సోకిన వారు తప్పకుండా క్వారంటైన్‌లో ఉండాలి. లేకపోతే కరోనా వ్యాప్తి చెందుతుంది. కరోనా వ్యాప్తి తీవ్రతరం ఉన్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించరాదని పదేపదే చెబుతున్నా.. కొందరు పట్టించుకోవడం లేదు. తాజాగా తైవాన్‌కు చెందిన ఓ వ్యక్తి హోం క్వారంటైన్ నిబంధనలను ఏడుసార్లు ఉల్లంఘించినందున అతని నుంచి అధికారులు రూ.35 వేల డాలర్లు (రూ.25 లక్షలకుపైగా) జరిమానా విధించారు. సెంట్రల్ తైవాన్‌లోని తైచుంగ్ ప్రాంతంలో ఈ వ్యక్తి నివాసముంటున్నట్లు అధికారులు గుర్తించారు. వ్యాపారం ట్రిప్ మీద చైనాకు వెళ్లి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉండకుండా బయట తిరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా మూడు రోజుల వ్యవధిలో ఏడు సార్లు నిబంధనలను ఉల్లంఘించాడని, ఈ మూడు రోజుల్లో షాపింగ్ అని, కారు సర్వీసింగ్ అని, తదితర కారణాలతో చుట్టుపక్కల ప్రాంతాలు తిరిగినట్లు అధికారులు తెలిపారు.
ఇలాంటి సమయంలో బయట ఎక్కడపడితే అక్కడి తిరగడం వల్ల కోవిడ్ వ్యాప్తి మరింత పెరిగి ప్రమాదం పొంచివుండే అవకాశం ఉంది. అయితే సదరు వ్యక్తి స్థానికంగా ఉంటున్న విషయాన్ని గమనించి అధికారులకు తెలుపడంతో వారు ఈ వ్యక్తికి భారీ జరిమానా విధించారు.కాగా, ఇలా కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిని కఠినమైన శిక్ష వేయాలంటూ తైచుంగ్ మేయర్ అధికారులను ఆదేశించారు.
కాగా, అతనికి రూ. 25 లక్షల జరిమానాతో పాటు క్వారంటైన్‌లో ఉన్నంత కాలం రోజుకు 107 డాలర్లు (రూ.7,800) చెల్లిస్తూ ఉండాలని మేయర్ ఆదేశించారు. అయితే తైవాన్లో ఇప్పటి వరకు మొత్తం 889 మందికిపైగా కరోనా బారిన పడగా, ఏడుగురు మృతి చెందారు. ఇతర దేశాలతో పోలిస్తే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా.. నిబంధనలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి.