విషాదం.. కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి
Landslides kill at least 15 people in southern Peru.దక్షిణ పెరూలో విషాదం చోటు చేసుకుంది
By తోట వంశీ కుమార్ Published on 7 Feb 2023 9:31 AM IST
దక్షిణ పెరూలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో కనీసం 15 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. మరో ఇద్దరు కనిపించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు.
అరేక్విపా ప్రాంతంలో ఆదివారం కుండపోతగా వర్షం కురియడంతో మట్టితో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. నికోలస్ వాల్కార్సెల్ అనే ప్రాంతంలోని నాలుగు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్రామాల సమీపంలోని కొండల్లో మైనర్లు కూడా పని చేస్తున్నారు. బురదలో కొందరు కొట్టుకుపోగా, మరికొందరు మట్టిపెళ్లల కింద చిక్కుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నారు. వారిని రక్షించే ప్రయత్నాలను మొదలుపెట్టాయి. ఈ ఘటనలో ఇప్పటి మరణించిన వారి సంఖ్య 15 కి పెరిగింది అని అరేక్విపా ప్రాంతంలోని నేషనల్ సివిల్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టరేట్ తెలిపింది,
ఈ ఘటనపై అరేక్విపా గవర్నర్ రోహెల్ సాంచెజ్ స్పందించారు. నికోలస్ వాల్కార్సెల్ అనే ప్రాంతంలోని నాలుగు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. అక్కడ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అరేక్విపా అంతటా దాదాపు 12,000 మంది ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రభావితం అయ్యారు అని చెప్పారు.
హెలికాఫ్టర్ల ద్వారా టెంట్లు, నీటి ట్యాంకులు, ఇసుక సంచులను తరిలించి సహాయ సిబ్బంది ద్వారా బాధితులకు అందిస్తున్నట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.