తొలి ప్రదర్శనతోనే అలరించిన లహరి
Kuchipudi Dance Performed by Lahari in Atlanta. తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నాట్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది.
By Medi Samrat Published on 4 July 2022 3:30 AM GMT
తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నాట్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. జార్జియా రాష్ట్రం అట్లాంటాలో 17 ఏళ్ల లహరి పిసికె ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన స్థానిక అమెరికన్లతో పాటు అహూతులైన తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. అట్లాంటాలో పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నిర్వహిస్తున్న వేణు కుమార్ రెడ్డి, వాసవి దంపతుల కుమార్తె అయిన లహరి 8 వ ఏట నుంచే కూచిపూడిలో శిక్షణ పొందింది. ఆదివారం నాడు తొలి ప్రదర్శనతో అందరినీ అలరించింది.
కూచిపూడిలోని అత్యంత కఠినమైన 100 రకాలు పాద ముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్త ముద్రలు, కళ్ల కదలికలతో ముఖంలో అనేక భావాలను పలికించి ప్రశంసలు పొందింది. విఘ్నేశ్వర, నటరాజ పూజలతో మొదలైన నాట్య ప్రదర్శన నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగింది. వేణు స్వగ్రామం నల్లొండ జిల్లాలోని అల్వాల గ్రామం. 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అనుబంధ సంస్థ అయిన అమెరికా క్రికెట్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడిగా కొనసాగుతున్నారు.