నేపాల్ ప్రధాని పదవికి కేపీ శర్మా ఓలి రాజీనామా
కాఠ్మాండు నగరమంతా అగ్నికి ఆహుతవుతున్న పరిస్థితుల్లో, నేపాల్ ప్రధానమంత్రి కే.పీ. శర్మా ఓలి మంగళవారం రాజీనామా చేశారు.
By Knakam Karthik
నేపాల్ ప్రధాని పదవికి కేపీ శర్మా ఓలి రాజీనామా
కాఠ్మాండు నగరమంతా అగ్నికి ఆహుతవుతున్న పరిస్థితుల్లో, నేపాల్ ప్రధానమంత్రి కే.పీ. శర్మా ఓలి మంగళవారం రాజీనామా చేశారు. అవినీతి వ్యతిరేక ఆందోళనలతో ఆగ్రహించిన ప్రజలు ఆయన ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు వ్యక్తిగత నివాసాన్ని కూడా ముట్టడి చేశారు.
నిన్న సోషల్ మీడియా నిషేధంపై జరిగిన భారీ నిరసనలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈరోజు మరింత ఉద్రిక్తత నెలకొంది. తెల్లవారుజాము నుంచే నిరసనకారులు రోడ్లపై టైర్లు దహనం చేస్తూ “కేపీ చోర్, దేశ్ ఛోడ్” అంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులు కేవలం రోడ్లపై కాకుండా ప్రభుత్వ భవనాలు, మంత్రుల ఇళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. ప్రసిడెంట్ రామ్ చంద్ర పౌడెల్ నివాసం, ఉప ప్రధాని బిష్ణు పౌడెల్ ఇంటి, ఎనర్జీ మంత్రి దీపక్ ఖడ్కా, హోం మంత్రి రమేశ్ లేఖక్ ఇళ్లు దగ్ధమయ్యాయి. అలాగే మాజీ ప్రధాని ప్రచండ నివాసం వద్ద పోలీస్ పికెట్‌ను కూడా దహనం చేశారు. సమాచార మంత్రి ప్రీత్వి సుబ్బా గురుంగ్ ఇంటిని కూడా కాల్చివేశారు.
పార్లమెంట్ భవనం, కాలిమతి పోలీస్ స్టేషన్ వంటి పలు ప్రదేశాలు కూడా నిరసనకారుల దాడికి గురయ్యాయి. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA)*లో అన్ని అంతర్జాతీయ విమానాలు మధ్యాహ్నం 12:45 తర్వాత నిలిపివేయబడ్డాయి. ఇండిగో విమానాలు కాఠ్మాండు గగనతలంలో హోల్డింగ్ ప్యాటర్న్‌లో నిలిచిపోయాయి. ప్రభుత్వంపై ప్రజల కోపం మరింతగా ఉధృతం అవుతుండగా, నిరసనకారులు స్పష్టంగా “ఈ ప్రభుత్వం నైతిక హక్కు కోల్పోయింది. ఇంటరిమ్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి” అని డిమాండ్ చేస్తున్నారు.