అమెరికా రెచ్చగొడుతోంది.. కిమ్ సంచలన ఆరోపణలు
ఉత్తర కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 22 Nov 2024 2:04 PM GMTఉత్తర కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోంగ్ ఉన్ అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా ఉద్రిక్తతలు పెంచుతోందని, అణు యుద్ధం ప్రమాదం ఇంకా పొంచి ఉందని హెచ్చరించారు. ప్యోంగ్యాంగ్‌లో జరిగిన డిఫెన్స్ ఎగ్జిబిషన్‌లో కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ చర్యలను దూకుడైనవిగా అభివర్ణించారు. అమెరికా తీరు మారకపోతే అత్యంత విధ్వంసక థర్మోన్యూక్లియర్ యుద్ధంగా మారవచ్చని కిమ్ హెచ్చరించారు. కొరియా ద్వీపకల్పంలో అమెరికా ఉద్రిక్తతలను పెంచుతోందని, తమ దేశం విషయంలో శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో అమెరికా ముందు స్థానంలో ఉందని కిమ్ ఆరోపించారు. అమెరికా మమ్మల్ని రెచ్చగొడుతోంది, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచే నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.
ఇంతటి ఘర్షణ వాతావరణాన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నారు కిమ్. అమెరికాతో చర్చలు జరిపేందుకు తాను ఎప్పుడో ముందుకు వచ్చానని, తాను చాలా దూరం వెళ్లినప్పటికీ అమెరికా నుంచి సరైన స్పందన రాలేదన్నారు. నార్త్ కొరియా శత్రు దేశాలకు మద్దతుగా అమెరికా బాంబర్లు, విమానాలు, నౌకలు వంటి ఆయుధాలను మోహరించడం ద్వారా సైనిక ఒత్తిడిని పెంచుతోందని కిమ్ ఆరోపించారు.