దాదాపు ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్‌లో బర్గర్‌లను ఇష్టంగా తింటారు. అయితే ఆ బర్గర్ హత్య వరకూ తీసుకెళ్తుందని అనుకుంటామా? బర్గర్ కోసం ఓ యువకుడు తన స్నేహితుడిని హతమార్చిన ఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో వెలుగుచూసింది. యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి తిందామని రెండు బర్గర్‌లను ఆర్డర్ చేశాడు.. అయితే యువకుడి స్నేహితుడు ఒక బర్గర్‌ను తిన్నాడు. దీంతో వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన యువకుడు తన స్నేహితుడిని హతమార్చాడు. ఫిబ్రవరి 8న జరిగిన ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ పూర్తి చేశారు. ఈ సంఘటన కరాచీలోని డిఫెన్స్ ఫేజ్ 5 ప్రాంతంలో జరిగింది. బాధితుడిని సెషన్స్ జడ్జి కుమారుడు అలీ కిరియోగా గుర్తించగా.. నిందితుడు డానియాల్ ఎస్‌ఎస్‌పి నజీర్ అహ్మద్ మిర్బహర్ కుమారుడు.
ఫిబ్రవరి 8న డానియాల్ తన స్నేహితురాలు షాజియాను తన ఇంటికి ఆహ్వానించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కార్యక్రమంలో స్నేహితుడు అలీ కిరియో, అతని సోదరుడు అహ్మర్ కూడా ఉన్నారు. నిందితుడు తన కోసం, షాజియా కోసం రెండు బర్గర్‌లను ఆర్డర్ చేశాడు. అయితే కిరియో ఆ బర్గర్‌ను కొద్దిగా కొరికి తిన్నాడు.. అది డానియాల్‌కు కోపం తెప్పించింది. కొద్దిసేపటికే విషయం తీవ్రస్థాయికి చేరడంతో నిందితుడు గార్డు రైఫిల్ నుంచి కిరియోపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు పూర్తి చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. నివేదికల ప్రకారం.. హత్యకు పోలీసు అధికారి కుమారుడే బాధ్యుడని తేలింది. నిందితుడు డానియాల్ నజీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.