ఘోర ప్ర‌మాదం.. లోయ‌లో ప‌డిన బ‌స్సు.. 39 మంది స‌జీవ ద‌హ‌నం

Karachi-bound passenger coach falls into ravine in Balochistan.బ‌స్సు అదుపు త‌ప్పి లోయలో ప‌డిపోయింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2023 6:32 AM GMT
ఘోర ప్ర‌మాదం.. లోయ‌లో ప‌డిన బ‌స్సు.. 39 మంది స‌జీవ ద‌హ‌నం

పాకిస్థాన్ దేశంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. బ‌స్సు అదుపు త‌ప్పి లోయలో ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

48 మంది ప్ర‌యాణీకుల‌తో ప్యాసింజ‌ర్ బ‌స్సు క్వెట్టా నుంచి క‌రాచీకి బ‌య‌లుదేరింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని లాస్బెలా జిల్లాలోని బేలా ప్రాంతంలో అదుపు త‌ప్పి వంతెన పై నుంచి లోయ‌లోకి ప‌డిపోయింది. బ‌స్సు కింద ప‌డిన వెంట‌నే మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లో మంట‌లు బ‌స్సు మొత్తం వ్యాపించాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు, అధికారులు రెస్క్యూ సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 39 మంది స‌జీవ ద‌హ‌నం అయిన‌ట్లు అధికారులు తెలిపారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ‌గా వారిని లాస్బెలాలోని సివిల్ ఆసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్న‌ట్లు లాస్బెలా అసిస్టెంట్ కమీషనర్ హంజా అంజు తెలిపారు.

లాస్బెలా సమీపంలో యు-టర్న్ తీసుకుంటుండగా కోచ్ వంతెన పిల్లర్‌ను బ‌స్సు ఢీకొట్టింది. వాహనం తదనంతరం లోయలోకి దూసుకెళ్లింది, ఆపై మంటలు చెలరేగాయ‌ని ఓ అధికారి చెప్పారు.

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అతి వేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని బావిస్తున్నారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story