కాబుల్‌లో విమాన సర్వీసులు పునఃప్రారంభం

Kabul airport reopens for domestic flights. రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఎయిర్‌పోర్టు 5 రోజుల తర్వాత తిరిగి

By అంజి  Published on  6 Sep 2021 1:48 AM GMT
కాబుల్‌లో విమాన సర్వీసులు పునఃప్రారంభం

అప్ఘాన్‌ : రాజధాని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఎయిర్‌పోర్టు 5 రోజుల తర్వాత తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతానికి డొమెస్టిక్ విమానాలు మాత్రమే నడపనున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. గత నెల 31వ తేదీన అమెరికా బలగాల ఉపసంహరణ అనంతరం కొద్ది రోజుల పాటు ఎయిర్‌పోర్టు సర్వీసులను నిలిపివేశారు. కాబూల్‌ నుంచి మూడు ప్రావిన్స్‌లకు విమానాలను నడపనున్నట్లు అరియానా అప్ఘాన్ విమాన సంస్థ తెలిపింది.

దక్షిణ కాందహార్, ఉత్తర బల్క్, హెరాత్ నగరాలకు విమానాలు నడపనున్నట్లు పేర్కొన్నారు. అయితే అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత రాలేదు. ఆగస్టు 31వ తేదీ రోజు అర్థరాత్రి అమెరికాకు చెందిన చివరి విమానం లార్జ్ సీ-17 కాబుల్ నుంచి టేకాఫ్ అయింది. దీంతో హమీద్ కర్జాయ్ ఎయిర్‌పోర్టును తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్లు కాబూల్‌ను తమ వశం చేసుకున్న తర్వాత ఆప్ఘాన్‌ పౌరులు అనేక మంది దేశం దాటేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

తొక్కిసలాటలు, బాంబు పేలుళ్లు, కాల్పులు, దేశం దాటేందుకు విమానానికి వేలాడుతూ ప్రయాణిస్తూ ఎంతో మంది తమ ప్రాణాలను విడిచారు. దీంతో అక్కడ హింసాత్మక పరిస్థితులు కొనసాగాయి. భారత్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌తో పాటు అనేక దేశాలు తమ పౌరులను కాబూల్‌ నుంచి వారి స్వస్థలాలకు తరలించాయి. అప్ఘానిస్తాన్‌లో 20 ఏళ్ల పాటు అమెరికా బలగాలు సేవలందించాయి. 2021 ఆగస్టు 31వ తేదీన అమెరికా తన బలగాల ఉపసంహరణను పూర్తి చేసింది. దాదాపు 1.24 లక్షల మందిని విమానాల్లో సురక్షితంగా తరలించింది అమెరికా ఆర్మీ.


Next Story