కాబుల్ పేలుళ్లపై జో బైడెన్.. వారిని వదిలిపెట్టం.. ప్రతీకారం తీర్చుకుంటాం
Joe Biden to Kabul attackers 'We will hunt you down and make you pay'.కాబుల్ విమానాశ్రమం వెలుపల జరిగిన
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2021 3:28 AM GMTకాబుల్ విమానాశ్రమం వెలుపల జరిగిన పేలుళ్ల ఘటనపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. తమ సైనికుల ప్రాణాలు తీసిన వారిపై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. ఉగ్రమూకలు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు. ఇక ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించిన నేపథ్యంలో.. ఐసిస్ నాయకులను హతమార్చాలని అమెరికన్ ఆర్మీని జో బైడెన్ ఆదేశించారు. ఈనెల(ఆగస్టు) 31 కల్లా అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైనిక బలగాలను పూర్తి స్థాయిలో తరలిస్తామని బైడెన్ మరోసారి తెలిపారు.
అఫ్గానిస్థాన్ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. దీంతో అఫ్గాన్ దేశ ప్రజలతో పాటు అక్కడ నివసిస్తున్న విదేశీయులు అఫ్గాన్‌ను విడిచి వెళ్లేందుకు కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం దగ్గర ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు గురువారం ఉదయం హెచ్చరికలు జారీ చేయగా.. కొన్ని గంటల వ్యవధిలోనే గురువారం సాయంత్రం విమానాశ్రయం వెలుపల జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 72 మంది మంది మృతి చెందగా.. 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా మృతుల్లో 11 మంది మెరీన్ కమాండోలతో పాటు ఓ నేవీ డాక్టర్ ఉన్నట్లు అమెరికా తెలిపింది.