పోరాటాన్ని వదలం.. కార్యాలయాన్ని వీడుతూ బిడెన్ వ్యాఖ్య‌లు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బిడెన్ వాషింగ్టన్ కార్యాలయాన్ని వీడుతూ.. పోరాటాన్ని విరమించేది లేదని త‌న శ్రేణుల‌కు హామీ ఇచ్చారు.

By Medi Samrat  Published on  21 Jan 2025 9:51 AM IST
పోరాటాన్ని వదలం.. కార్యాలయాన్ని వీడుతూ బిడెన్ వ్యాఖ్య‌లు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బిడెన్ వాషింగ్టన్ కార్యాలయాన్ని వీడుతూ.. పోరాటాన్ని విరమించేది లేదని త‌న శ్రేణుల‌కు హామీ ఇచ్చారు. రిపబ్లికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బిడెన్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం మొదటి ప్రసంగం చేసిన‌ కొద్దిసేపటికే బిడెన్ ఈ ప్రకటన చేశాడు. అంతకుముందు.. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు అధ్యక్ష పదవికి వీడ్కోలు పలికిని బిడెన్‌.. తన కుటుంబంతో కాలిఫోర్నియాకు వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు.

అమెరికాలో అధికార మార్పిడికి ముందు బిడెన్.. ట్రంప్‌కు మర్యాద పూర్వ‌క స్వాగ‌తం ప‌లికారు. బిడెన్, ఆయ‌న‌ భార్య జిల్ సంప్రదాయ తేనీటి విందు కోసం వైట్ హౌస్‌కి వచ్చిన ట్రంప్, అతని భార్య మెలానియాను స్వాగతించారు. వైట్ హౌస్‌కి స్వాగతం అని బిడెన్ ట్రంప్‌కు చెప్పారు. అనంతరం జాతినుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ట్రంప్ ప్రసంగ స‌మ‌యంలో వైట్ హౌస్ సిబ్బంది బిడెన్ మిగిలిన సామాను తొలగించి.. ట్రంప్, ఆయ‌న‌ కుటుంబం తిరిగి రావడానికి మార్గం సుగమం చేశారు.

ప్రసంగం తర్వాత కొత్త అధ్యక్షుడు ట్రంప్, ఆయ‌న‌ భార్య.. బిడెన్‌ను అతని సిబ్బందితో వీడ్కోలు వేడుక కోసం జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు తీసుకెళ్లడానికి కాపిటల్ మైదానంలో వేచి ఉన్న హెలికాప్టర్ వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. మీరు లేకుండా మేము ఏమీ చేయలేమని బిడెన్ తన సిబ్బందితో చెప్పాడు. చరిత్రలో నిలిచిపోయే జట్టును ఎన్నుకున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టును ఎంచుకున్నాం. మేము కార్యాల‌యం నుంచి నిష్క్రమిస్తున్నాం.. కానీ పోరాటాన్ని వదిలేయ‌డం లేదని అన్నారు.

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే అధ్యక్ష కార్యాలయ వెబ్‌సైట్ 'వైట్ హౌస్' కొత్త రంగులో కనిపించింది. దానిపై 'అమెరికా ఈజ్ బ్యాక్' బ్యానర్ ఉంది. వైట్ హౌస్ వెబ్‌సైట్‌లో ట్రంప్ (78) సంతకం చేసిన సందేశం ఉంది.. అందులో 'నా జీవితంలోని ప్రతిరోజూ, ప్రతి శ్వాస మీ కోసం నేను పోరాడతాను. బలమైన, సురక్షితమైన, సంపన్నమైన అమెరికాను నిర్మించే వరకు నేను విశ్రమించను. ఇది నిజంగా అమెరికా స్వర్ణయుగం అవుతుంది అని పేర్కొన్నారు.

Next Story