కాబూల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్లు.. 72 మంది మృతి.. ఇది మా పనే ఐసిస్
ISIS claims responsibility as dozens die in Kabul airport blasts.కాబూల్ విమానాశ్రమంలో ఉగ్రదాడి జరిగే అవకాశం
By తోట వంశీ కుమార్ Published on 27 Aug 2021 8:35 AM ISTకాబూల్ విమానాశ్రమంలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికాతో సహా పలు దేశాలు జారీ చేసిన హెచ్చరికలు నిజం అయ్యాయి. అఫ్గానిస్థాన్ తాలిబన్ల హస్తగతం కావడంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. దీంతో అఫ్గాన్ దేశ ప్రజలతో పాటు అక్కడ నివసిస్తున్న విదేశీయులు అఫ్గాన్‌ను విడిచి వెళ్లేందుకు కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయం దగ్గర ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలు గురువారం ఉదయం హెచ్చరికలు జారీ చేయగా.. కొన్ని గంటల వ్యవధిలోనే గురువారం సాయంత్రం విమానాశ్రయం వెలుపల జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 72 మంది మంది మృతి చెందగా.. 143 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కాగా మృతుల్లో 11 మంది మెరీన్ కమాండోలతో పాటు ఓ నేవీ డాక్టర్ ఉన్నట్లు అమెరికా తెలిపింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పేలుళ్ల ధాటికి కొందరి శరీరాలు ముక్కలు ముక్కలుగా తెగిపడ్డాయి. ఆ ప్రాంతం మొత్తం రక్తంతో తడిచిపోయింది. ఎటుచూసిన తెగిపడిన శరీర భాగాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆత్మాహుతి దాడి జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇది మా పనే..
విమానాశ్రమం వెలుపల వరుస పేలుళ్లను తామే జరిపినట్లు ఇస్టామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించింది. ఇద్దరు ఆత్మాహుతి దాడులకు పాల్పడినట్లు చెప్పింది. అబే గేటు వద్ద చోటుచేసుకున్న పేలుడుకు సంబంధించి ఆత్మాహుతి బాంబర్ ఫోటోను విడుదల చేసింది. మొదట విమానాశ్రయం వద్ద కొన్ని నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరగ్గా ఆ తర్వాత కొన్ని గంటలకు సెంట్రల్ కాబూల్‌లో మరో పేలుడు సంభవించింది.
పేలుళ్లకు అమెరికా బలగాలే బాధ్యత: తాలిబన్లు
కాగా కాబూల్ ఎయిర్‌పోర్టు వద్ద పేలుళ్ల ఘటనను తాలిబన్లు ఖండించారు. కాబూల్‌లో జరిగిన పేలుళ్లను ఉగ్రదాడిగా తాలిబన్ అభివర్ణించింది. తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ... అమెరికా బలగాలున్న ప్రాంతంలోనే పేలుళ్లు జరిగాయని, పేలుళ్లకు అమెరికా బలగాలే బాధ్యత వహించాలని అన్నారు. ప్రజల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటూ, ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకుంటామని తాలిబన్లు పేర్కొన్నారు.
ఖండించిన వివిధ దేశాలు, యూఎన్‌వో..
కాబూల్ పేలుళ్లును యూఎన్‌వో సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరన్‌లు, నాటో, ఫ్రాన్స్, భారత్‌తో పాటు పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. పేలుళ్ల ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు భారత ప్రభుత్వం ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.