ఇరాన్‌కు మరో దెబ్బ.. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ చీఫ్ మృతి
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ తీవ్ర నష్టాలను చవిచూసింది.
By - Medi Samrat |
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనం ప్రకారం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) గూఢచార సంస్థ అధిపతి మజీద్ ఖాదెమి హతమయ్యారు. ఈ దాడికి అమెరికా, ఇజ్రాయెల్‌లే కారణమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ఆరోపించింది. మేజర్ జనరల్ మజీద్ ఖాదెమి ఎక్కడ హతమయ్యారనే వివరాలను IRGC వెంటనే వెల్లడించలేదు. అయితే, ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సోమవారం తెల్లవారుజామున అనేక వైమానిక దాడులు జరిగాయి.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌సి) ఇంటెలిజెన్స్ విభాగాధిపతి, మేజర్ జనరల్ మజీద్ ఖాదేమీ, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యారని, సోమవారం ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రచురించిన గార్డ్స్ ప్రకటన వెల్లడించింది.
నివేదికల ప్రకారం.. మజీద్ ఖాదెమీ దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఇరాన్ గూఢచార, భద్రతా వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషించారు. ఖాదెమీ దాదాపు అర్ధ శతాబ్దం పాటు నిజాయితీ, ధైర్యంతో విప్లవానికి, వ్యవస్థకు, ఇస్లామిక్ మాతృభూమికి గూఢచార, భద్రతా రంగాలలో ముఖ్యమైన, శాశ్వతమైన, బోధనాత్మకమైన సేవలను అందించారు. ఆయన ప్రయత్నాలు రాబోయే అనేక సంవత్సరాల పాటు దేశ నిఘా విభాగానికి, ముఖ్యంగా వ్యూహాత్మక స్థాయిలో విదేశీ శత్రువులను ఎదుర్కోవడంలో మార్గదర్శకంగా ఉపయోగపడతాయని ఐఆర్‌జిసి పేర్కొంది.
సోమవారం ఇజ్రాయెల్, అమెరికా జరిపిన వరుస దాడుల్లో 25 మందికి పైగా మరణించారు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్, దాని పొరుగు దేశాలపై దాడి చేసింది. ఆదివారం హైఫా నగరంలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఇద్దరు మరణించారు.