ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Indonesia issues tsunami warning.ఇండోనేషియాలో భారీ భూకంపం సంభ‌వించింది. ఫ్లోర్స్ స‌ముద్ర తీర ప్రాంతంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Dec 2021 5:44 AM GMT
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభ‌వించింది. ఫ్లోర్స్ స‌ముద్ర తీర ప్రాంతంలో ఈ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 7.6గా న‌మోదు అయిన‌ట్లు అమెరికా జియోలాజిక‌ల్ స‌ర్వే తెలుప‌గా.. యురోపియ‌న్‌-మెడిట‌రేనియ‌న్ సెసిమాల‌జిక‌ల్ సెంట‌ర్ భూకంప తీవ్ర‌త‌ను 7.7గా అంచ‌నా వేసింది. మామెర్ పట్టణానికి ఉత్తరాన 100 కిలోమీటర్ల దూరంలో ఫ్లోరస్ సముద్రంలో 18.5 కిలోమీటర్ల అడుగున భూకంప కేంద్రం ఉన్న‌ట్లు గుర్తించారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ఇండోనేషియా ప్ర‌భుత్వం సునామీ హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేసింది.

తెల్ల‌వారుజామున 3.20 నిమిషాల‌కు భూకంపం సంభవించింది. దీని ప్ర‌భావంతో వెయ్యి కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు అల‌లు భ‌యంక‌రంగా ఎగిసిప‌డే అవ‌కాశం ఉంద‌ని.. ప‌సిఫిక్ సునామీ వార్నింగ్ సెంట‌ర్ హెచ్చ‌రించింది. కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లినట్లుగా స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

ఇండోనేషియా పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' స్థానంపై ఉన్న కారణంగా ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తున్నాయి. జపాన్ నుంచి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ మీదుగా విస్తరించి ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడంతో తీవ్రమైన భూకంపాలు సంభవిస్తున్నాయి. సుమత్రా దీవుల్లో డిసెంబర్ 26, 2004న 9.1 తీవ్రతతో భూకంపం సంభ‌వించింది. ఫ‌లితంగా సునామీ వ‌చ్చింది. దీని కారణంగా ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్‌తో పాటు తొమ్మిది దేశాలలో 2,30,000 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క ఇండోనేషియాలో 1,70,000 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌రిత్ర‌లో ఇదే అతి పెద్ద విషాదం.

Next Story