కాప్‌ 26 సదస్సులో గర్జించిన భారతీయ బాలిక

Indian girl message to world leaders at glasgow. గ్లాస్గో వేదికగా కాప్‌ 26 (అంతర్జాతీయ వాతావరణ సదస్సు) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ బాలిక వినీశా ఉమాశంకర్‌

By అంజి  Published on  3 Nov 2021 7:48 AM GMT
కాప్‌ 26 సదస్సులో గర్జించిన భారతీయ బాలిక

గ్లాస్గో వేదికగా కాప్‌ 26 (అంతర్జాతీయ వాతావరణ సదస్సు) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారతీయ బాలిక వినీశా ఉమాశంకర్‌ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాల ప్రజలను ఆలోచింపజేస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితులపై వినీశా తన ఆవేదనను వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వంటి ప్రపంచ దేశాధితనేతలు హాజరైన ఈ సమావేశంలో ఏ మాత్రం భయపడకుండా తన అభిప్రాయాలను వినీశా చెప్పింది. భూమిని కాపాడాలని ప్రపంచ దేశాధినేతలను అభ్యర్థించింది. వాగ్దానాలు చేస్తున్న ప్రపంచ నేతలు.. వాటిని నెరవేర్చడంలో విఫలమవుతున్నారని, అబద్ధపు హామీలు వినివినీ మా తరం విసిగిపోతోందని అన్నారు.

తాను పనిచేయాలనుకుంటున్నానని, తాను కేవలం భారత బాలికను మాత్రమే కాదని.. ఈ భూమి పుత్రికను అందుకు తాను చాలా గర్విస్తున్నానని వినీశా చెప్పింది. తాను ఓ స్టూడెంట్‌ అని పర్యావరణవేత్తను అని.. అంతకంటే ఓ ఆశావాదినని చెప్పింది. ప్రపంచ నేతలపై కోపం తెచ్చుకునేందుకు నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయని, అయితే అందుకు నా దగ్గర సమయం లేదని వినీశా పేర్కొంది. ఇప్పటికైనా మాటలు ఆపి.. చేతల్లో చూపించాలని, పాత పద్ధతులను ఆపేసి.. భవిష్యత్‌ కోసం కొత్త దృక్పథం నిర్మించాలని చెప్పింది. తమ ఆవిష్కరణలు, సృజనపై డబ్బులను వెచ్చించి.. నవతరం భవిష్యత్‌ కోసం ప్రయత్నాలు చేయాలని వినీశా చెప్పింది. మా భవిష్యత్‌ను మేం నిర్మించుకుంటామని వినీశా ఉమాశంకర్‌ ఆవేదనతో ప్రసంగం చేసింది. ఆమె ప్రసంగానికి సభ వేదిక క్లాప్స్‌తో మార్మోగింది.

వినీశా ఉమాశంక్‌ స్వస్థలం తమిళనాడులోని తరువణ్ణమలై జిల్లా. చిన్నప్పుడు పాఠశాలకు వెళ్లి, ఇంటికి వచ్చే సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఇస్త్రీ కొట్టును గమనించేది వినీశా. దానిలో వాడే బొగ్గు, జరుగుతున్న కాలుష్యం గురించి బాగా ఆలోచించిన వినీశా.. తన మెదడుకు తట్టిన ఆలోచనతో సోలార్‌తో పని చేసే ఐరనింగ్‌ బండిని రూపొందించింది. ఆ తర్వాత బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియమ్స్‌ ప్రారంభించిన ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ పోటీల్లో ఫైనల్‌ వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే కాప్‌26 సదస్సుకు వినీశాను ప్రిన్స్ విలియమ్స్‌ ఆహ్వానించారు. కాప్‌ 26 సదస్సులో క్లీన్‌ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ అనే అంశంపై వినీశా ప్రసంగం చేసింది.

Next Story