భారత రక్షణలో రాఫెల్ యుద్ధ విమానాలు ఎంతో మేలు చేస్తాయని భారత సైన్యం చెప్పింది. భారత్ రక్షణ పరంగా చేసుకున్న అతి పెద్ద డీల్ లో రాఫెల్ యుద్ధ విమానాల డీల్ కూడా ఒకటి. ఫ్రాన్స్ తో రూ. 59 వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం 2016లో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 10న తొలి రాఫెల్ భారత్ కు వచ్చింది.
రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, కీలక ప్రకటన చేశారు. వచ్చే నెల నాటికి భారత భూభాగంపై 17 రాఫెల్ జెట్స్ ఉంటాయని ఆయన అన్నారు. ఇప్పటి వరకు 11 విమానాలు వచ్చాయని చెప్పారు. వచ్చే ఏడాదికల్లా మొత్తం విమానాలు (36) భారత్ కు చేరుకుంటాయని అన్నారు. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ సమాచారాన్ని వెల్లడించారు.
రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరుతూ ఉండడంతో చైనా కూడా భయపడుతూ ఉందని భారత వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. చైనా బలగాలు వారి జే-20 యుద్ధ విమానాలను ఈశాన్య లడఖ్ సరిహద్దు వరకు తీసుకొచ్చాయి. వారు అక్కడ్నుంచి వెళ్లిపోయినా తిరిగివచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ సమయంలోనే భారత భద్రతా దళాల చేతికి రఫేల్ యుద్ధ విమనాలు వచ్చాయి. సరిహద్దులో ఉన్న వారి యుద్ధ విమానాలు సామర్థ్యం మాకు తెలుసు. అందుకే రఫేల్ యుద్ధ విమానాలను రంగంలోకి దించామని భదౌరియా తెలిపారు. చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న ఈశాన్య లడఖ్ ప్రాంతంలోనే రాఫెల్ యుద్ధ విమానాలు మోహరించి ఉన్నాయి.