తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా భారీ విజ‌యం.. ఆ గ‌డ్డ మీద ఓట‌మి లేదు.. కానీ

తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించి భారత జట్టు చరిత్ర సృష్టించింది.

By Kalasani Durgapraveen  Published on  25 Nov 2024 2:00 PM IST
తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా భారీ విజ‌యం.. ఆ గ‌డ్డ మీద ఓట‌మి లేదు.. కానీ

తొలి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించి భారత జట్టు చరిత్ర సృష్టించింది. 16 ఏళ్ల తర్వాత పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించింది. ఇంతకు ముందు 2008లో కుంబ్లే సారథ్యంలో భారత్ ఆస్ట్రేలియాను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగింది. బుమ్రా కెప్టెన్సీలో భారత జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాను ఓడించిన తొలి విజిటింగ్ జట్టుగా కూడా భారత జట్టు నిలిచింది.

టాస్ గెలిచిన భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసింది. అనంత‌రం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసి.. 533 పరుగుల ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ లేరు. అయినప్పటికీ టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

ఈ టెస్టుకు ముందు పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది. ఐదో మ్యాచ్‌లో భార‌త్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అంతకుముందు మ్యాచ్‌లు పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ స్టేడియంలో జరిగాయి. అయితే 2018 నుండి ఆప్టస్ స్టేడియంలో మ్యాచ్‌లు ఆడటం ప్రారంభమైంది. పెర్త్ (WACA, 2008), అడిలైడ్ (2008), గబ్బా (2021), ఇప్పుడు పెర్త్ (ఆప్టస్).. ఆస్ట్రేలియాలో భారత్ చారిత్రాత్మక మ్యాచ్‌లను గెలుచుకున్న ప్ర‌దేశాలు.

Next Story