'భార‌త్ మెరిసే మెర్సిడెస్‌.. పాకిస్థాన్‌ డంప్ ట్రక్'.. మంత్రి కూడా అవే వ్యాఖ్య‌లు

ఆపరేషన్ సింధూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్, పీఓకేలో ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది.

By Medi Samrat
Published on : 18 Aug 2025 2:44 PM IST

భార‌త్ మెరిసే మెర్సిడెస్‌.. పాకిస్థాన్‌ డంప్ ట్రక్.. మంత్రి కూడా అవే వ్యాఖ్య‌లు

ఆపరేషన్ సింధూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్, పీఓకేలో ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ గాయాన్ని పాకిస్థాన్ ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలో పర్యటించారు. ఈ సమయంలో ఆయ‌న‌ భారతదేశంతో పోల్చితే పాకిస్తాన్ పరిస్థితి చాలా సిగ్గుచేటు.. దారుణంగా ఉందని ప్రపంచం ముందు అంగీకరించాడు. ఒక ఉదాహరణ కూడా ఇస్తూ వివరించాడు. ఇప్పుడు ఆయన ప్రకటనకు మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఆమోదం కూడా లభించింది.

అమెరికా పర్యటనలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారతదేశాన్ని మెరిసే మెర్సిడెస్‌తో.. పాక్‌ను డంప్ చేసిన ట్రక్కుతో పోల్చారు. మునీర్ చేసిన ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వచ్చాయి. తాజాగా అసిమ్ మునీర్ ఉదాహరణను మంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా ఆమోదించారు.

ఇటీవల ఒక కార్యక్రమంలో ప్రసంగించిన పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. మేలో యుద్ధం మధ్య పాకిస్థాన్‌లో పర్యటించిన సౌదీ ప్రతినిధి బృందంతో ఫీల్డ్ మార్షల్ కూడా ఈ పోలిక పెట్టారని అన్నారు. ఇది మాత్రమే కాదు.. తన వ్యాఖ్యల సమయంలో పాక్ మంత్రి తప్పుడు వాదన కూడా చేశారు. పాకిస్థాన్‌లోని ఏ ప్రధాన సైనిక స్థావరంపై ఒక్క భారత క్షిపణి కూడా పడలేదని అన్నారు. భారత క్షిపణులు పాకిస్థాన్‌లోని అనేక ఎయిర్‌బేస్‌లను ఎలా ధ్వంసం చేశాయో ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ గత వారమే అమెరికాలో పర్యటించడం గమనార్హం. గత రెండు నెలల్లో రెండుసార్లు అమెరికా వెళ్లాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్, భారత్‌లను పోల్చారు. ఈ సమయంలో ఆయ‌న‌ భారతదేశాన్ని కొత్త మెరిసే మెర్సిడెస్ అని అభివర్ణించాడు. పాకిస్తాన్‌ను రాళ్లతో నిండిన ట్రక్ అని పిలిచాడు. కారును ట్రక్కు ఢీకొంటే ఎవరికి నష్టం? అని తల‌తిక్క వ్యాఖ్య‌లు చేశారు.

Next Story