అధికారికంగా భారత్‌కు జీ20 అధ్యక్ష పగ్గాలు

India gets G20 presidency as Bali Summit concludes. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

By M.S.R  Published on  16 Nov 2022 2:54 PM GMT
అధికారికంగా భారత్‌కు జీ20 అధ్యక్ష పగ్గాలు

ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ20 సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఏడాది జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంది. సమావేశాల్లో భాగంగా జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందుకున్నారు. జీ 20 సమావేశాల ముగింపు కార్యక్రమం ఈ రోజు జరిగింది. జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ అధికారికంగా వచ్చే నెల 1 నుంచి చేపట్టనుంది. ఏడాది పాటు (డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 20 దాకా) భారత్ జీ20 అధ్యక్ష స్థానంలో కొనసాగనుంది. వచ్చే ఏడాది భారత్ లోనే జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. బుధవారం సభ్య దేశాల అధినేతలు, ఆయా దేశాల ప్రతినిధి బృందాల కరతాళ ధ్వనుల మధ్య జోకో విడోడో నుంచి ప్రధాని మోదీ జీ20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. జీ20 అధ్యక్ష బాధ్యతలు ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. వచ్చే ఏడాది భారత్ లో జరగనున్న సదస్సులను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తామని కూడా మోదీ చెప్పుకొచ్చారు. వసుధైక కుటుంబం అనే భావనతో 2023లో జీ20 సదస్సును నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జీ20 అధ్యక్ష పదవిని చేపట్టడం ప్రతి భారతీయుడికి గొప్ప గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు.


Next Story