రాజ‌ప‌క్స పారిపోయేందుకు భార‌త్ స‌హ‌క‌రించిందా..? హైక‌మిష‌న్ ఏం చెప్పిందంటే

India denies ‘baseless reports’ of facilitating Gotabaya’s travel.తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 July 2022 6:20 AM GMT
రాజ‌ప‌క్స పారిపోయేందుకు భార‌త్ స‌హ‌క‌రించిందా..?  హైక‌మిష‌న్ ఏం చెప్పిందంటే

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. ఈ క్ర‌మంలో శ‌నివారం నుంచి ఆ దేశంలో మ‌రోసారి ప్ర‌జాందోళ‌న‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స అధ్య‌క్ష భ‌వనాన్ని వ‌దిలి ప‌రారు అయ్యారు. ఈరోజు(బుధ‌వారం) భార్యా, ఇద్ద‌రు బాడీగార్డుల‌తో లంక ను విడిచి మాల్దీవుల్లోని మాలేకు వెళ్లిపోయారు. అయితే.. రాజ‌ప‌క్స దేశాన్ని విడిచి వెళ్లేందుకు భార‌త్ స‌హాయం చేసిందంటూ ఆ దేశంలోని మీడియా సంస్థ‌లు క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేశాయి. కాగా.. ఈ వార్త‌ల‌ను భార‌త హైక‌మిష‌న్ తోసిపుచ్చింది.

'లంక అధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్స దేశం విడిచివెళ్లిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న దేశం దాటే విష‌యంలో భార‌త్ స‌హ‌క‌రించింద‌నే నిరాధార‌, ఊహాజ‌నిత వార్త‌లు మీడియాలో వ‌స్తున్నాయి. హైక‌మిష‌న్ వాటిని నిర్ధ్వందంగా ఖండిస్తోంది. లంక ప్ర‌జ‌ల‌కు భార‌త మ‌ద్ద‌తు కొన‌సాగుతోందని, ప్ర‌జ‌లు త‌మ ఆకాంక్ష‌ల‌ను ప్ర‌జాస్వామ్య‌, రాజ్యాంగ‌బ‌ద్ధంగా సాధించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారంటూ 'అంటూ భార‌త రాయ‌బార కార్యాల‌యం ట్వీట్ చేసింది.

అంట‌నోవ్‌-32 విమానంలో బుధ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో రాజ‌ప‌క్స‌, భార్య ఇద్ద‌రు బాడీగార్డుల‌తో మాల్దీవుల‌కు వెళ్లిపోయారు. ఈ విష‌యాన్ని ఆర్మీ కూడా ధ్రువీక‌రించింది. కాగా.. ఈ రోజు రాజీనామా చేస్తాన‌ని ఇంత‌ముందే రాజ‌ప‌క్స వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. దేశం విడిచి పోయేందుకు అనుమ‌తి ఇస్తేనే ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని మంగ‌ళ‌వారం కొత్త మెలిక పెట్టారు. మ‌రీ దేశం విడిచి వెళ్లిన నేప‌థ్యంలో ఆయ‌న రాజీనామాపై సందిగ్థ‌త నెల‌కొంది.

Next Story