పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై దుండగుల కాల్పులు

Imran Khan Injured In Firing At Pakistan Rally. పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు పెను ప్రమాదం తప్పింది. గురువారం నాడు నిర్వహించిన

By అంజి  Published on  3 Nov 2022 1:59 PM GMT
పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై దుండగుల కాల్పులు

పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు పెను ప్రమాదం తప్పింది. గురువారం నాడు నిర్వహించిన ర్యాలీలో ఇమ్రాన్‌ఖాన్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ''పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రయాణిస్తున్న కౌంటర్ మౌంటెడ్ ట్రక్కుపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపారు. ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు.'' అని పాకిస్తాన్‌కు చెందిన ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌ తెలిపింది. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లోని జాఫర్‌ అలీ ఖాన్‌ చౌక్‌లో ఈ ఘటన జరిగింది.

స్థానిక మీడియా వర్గాల సమాచారం ప్రకారం.. ఇమ్రాన్‌ ఖాన్ కాన్వాయ్ దగ్గర అనేక సార్లు కాల్పులు జరిగాయి. ముందస్తు ఎన్నికలు జరపాలని కోరుతూ పీటీఐ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. దుండగులు కాల్పులు జరిపిన వెంటనే, భద్రతా సిబ్బంది దాడి నుండి ప్రతిపక్ష నేతకు రక్షణ కల్పించారు. ఇమ్రాన్ ఖాన్ కుడి కాలికి బుల్లెట్ గాయమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇమ్రాన్‌ఖాన్‌తోపాటు ఆయన కార్యదర్శి రషీద్‌, సింధు మాజీ గవర్నర్‌ ఇమ్రాన్‌ ఇస్మాయిల్‌, పీటీఐ నేత ఫైసల్‌ జావేద్‌, తదితరులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిగిన తర్వాత ఇమ్రాన్‌ఖాన్‌ ను ఘటనా స్థలంలో బుల్లెట్‌ ప్రూఫ్‌ కారులోకి తరలించినట్లు వీడియో దృశ్యాలు ధృవీకరిస్తున్నాయి.


Next Story