ఐఫోన్ త‌యారీ ప్లాంట్‌లో ఉద్రిక్త‌త‌

Huge Foxconn iPhone plant in China rocked by fresh worker unrest.క‌రోనాకు పుట్టినిల్లుగా బావిస్తున్న చైనాలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Nov 2022 12:09 PM IST
ఐఫోన్ త‌యారీ ప్లాంట్‌లో ఉద్రిక్త‌త‌

క‌రోనాకు పుట్టినిల్లుగా బావిస్తున్న చైనాలో మ‌రోసారి కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనాను పూర్తిగా నిర్మూలించేందుకు జీరో కొవిడ్ వ్యూహాన్ని చైనా అమ‌లు చేస్తూ క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తోంది. ఎక్కడిక‌క్క‌డ లాక్‌డౌన్ల‌ను పెడుతోన్న‌ప్ప‌టికీ గురువారం రోజు రికార్డు స్థాయిలో 30 వేల‌కు పైగా కేసులు న‌మోదు అయిన‌ట్లు అక్క‌డి అధికారులు తెలిపారు. ఇందులో 27,517 మందిలో ఎటువంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేద‌ని చెప్పారు.

ఓ వైపు లాక్‌డౌన్, క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తూనే త‌మ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ తిన‌కుండా ఉండేందుకు ఫ్యాక్ట‌రీలు న‌డుపుకునేందుకు మాత్రం అనుమ‌తి ఇచ్చింది. అయితే.. ఫ్యాక్టరీ దాటి బ‌య‌ట‌కు వెళ్లేందుకు కార్మికుల‌కు అనుమ‌తి లేదు. దీంతో కొన్నినెల‌లుగా ఫ్యాక్ట‌రీల్లోనే కార్మికులు మ‌గ్గుతున్నారు. యాపిల్ ప్ర‌ధాన త‌యారీ భాగ‌స్వామి అయిన ఫాక్స్‌కాన్‌కు చెందిన ప్లాంట్ చైనాలోని జెంగ్‌జూలో న‌గ‌రంలో ఉంది.

కొద్ది రోజుల క్రితం లాక్‌డౌన్‌కు భ‌య‌ప‌డిన ఈ ప్లాంట్‌లో ప‌ని చేసే కార్మికుల్లో స‌గం మంది పారిపోయిన‌ల్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో కొత్త సిబ్బందిని నియ‌మించుకున్నారు. జీరో కొవిడ్ పాల‌సీతో విధించిన ఆంక్ష‌ల‌తో విసుగెత్తిన ఈ ఉద్యోగులు బుధ‌వారం ఉద‌యం ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు దిగారు. ఇది తీవ్ర ఉద్రిక్త‌ల‌కు దారితీసింది.

వంద‌లాది మంది కార్మికులు బ‌య‌ట‌కు వ‌చ్చి ఆందోళ‌న‌కు దిగారు. స‌రైన వ‌స‌తులు క‌ల్పించ‌డం లేద‌ని, జీతాలు కూడా స‌క్ర‌మంగా ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు. కొంత మంది ఉద్యోగులు క‌రోనాతో బాధ‌ప‌డుతున్న‌టికి వారికి వేరే గదులు కేటాయించడం లేదని మండిప‌డ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై ఫాక్స్ కాన్ స్పందించింది.

ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు తెలిపింది. కొత్త ఉద్యోగుల నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా సాంకేతిక లోపాన్ని గుర్తించిన‌ట్లు చెప్పింది. తొలుత చెప్పిన‌ట్లుగా జీతాలు ఇస్తామ‌ని, ప్ర‌స్తుత ఘ‌ట‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.

Next Story