మెక్సికో సెంట్రల్ పసిఫిక్ తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని మెక్సికో భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది. ఇదే భూకంప తీవ్రతను యూఎస్ జియోలాజికల్ సర్వే 7.6గా అంచనా వేసింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:05 గంటలకు భూకంపం సంభవించింది. మైకోకాన్ రాష్ట్రంలోని కోల్‌కోమన్‌కు దక్షిణంగా 59 కిలోమీటర్లు, అక్విలాకు ఆగ్నేయంగా 37 కిలోమీటర్ల దూరంలో 15.1 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని మెక్సికన్ భూకంప శాస్త్రవేత్తలు గుర్తించారు.
మెక్సికోలోని మిచోకాన్ తీరం వెంబడి సునామీ వచ్చే ఛాన్స్ ఉందని అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం ధాటికి చాలా భవనాలకు నష్టం జరిగింది. ఓడరేవు నగరమైన కొలిమాలోని మంజానిల్లోలో ఒక మాల్ వద్ద గోడ కూలిపోవడంతో ఒకరు మరణించారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న కోల్‌కోమన్, మైకోకాన్‌లో భవనాలు దెబ్బతిన్నాయి. భవనాలు పగుళ్లుబారాయి.
భూప్రకంపనలతో జనం వణికిపోయారు. తలోదిక్కు పరుగులు పెట్టారు. ఇళ్ల పైకప్పుల భాగాలు విరిగిపోయాయి. అయితే, భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరుగలేదని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బాయ్ ట్వీట్ చేశారు. కోల్‌కోమన్ పట్టణంలోని ఆసుపత్రికి తీవ్ర నష్టం వాటిల్లింది. 1985, 2017 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు మెక్సికోలో భూకంపాలు నమోదయ్యాయి. మళ్లీ అదే రోజు భారీ ప్రకంపనలు రావడం గమనార్హం. ఈ రెండు భూకంపాల్లో దాదాపు 10వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.