వైద్యం అందించకుండా నా భర్తను చంపారు

ప్రశాంత్ శ్రీకుమార్ అనే భారతీయుడు కెనడాలో మరణించాడు. తన భర్త ఎనిమిది గంటల పాటు వైద్యం అంద‌క‌ చనిపోయాడని ప్రశాంత్ కుమార్ భార్య నిహారిక శ్రీకుమార్ ఆసుపత్రి సిబ్బందిపై ఆరోప‌ణ‌లు చేసింది.

By -  Medi Samrat
Published on : 26 Dec 2025 2:22 PM IST

వైద్యం అందించకుండా నా భర్తను చంపారు

ప్రశాంత్ శ్రీకుమార్ అనే భారతీయుడు కెనడాలో మరణించాడు. తన భర్త ఎనిమిది గంటల పాటు వైద్యం అంద‌క‌ చనిపోయాడని ప్రశాంత్ కుమార్ భార్య నిహారిక శ్రీకుమార్ ఆసుపత్రి సిబ్బందిపై ఆరోప‌ణ‌లు చేసింది. ఈ విషయాన్ని నిహారిక సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ సమాచారం ఇచ్చింది.

ప్రశాంత్ శ్రీకుమార్ భార్య వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎనిమిది గంటల నిరీక్షణలో తన భర్త, త‌మ‌ కుటుంబం పడ్డ‌ ఇబ్బందులను నిహారిక ఈ వీడియోలో చెబుతోంది.

డిసెంబర్ 22 సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రశాంత్‌కు ఛాతీ నొప్పి రాగా.. మధ్యాహ్నం 12:20 గంటలకు గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి తీసుకెళ్లామ‌ని నిహారిక తెలిపింది. అక్క‌డ ప్రశాంత్‌ మధ్యాహ్నం 12:20 నుండి రాత్రి 8:50 వరకు ప్రథమ చికిత్స కోసం కూర్చున్నట్లు నిహారిక తెలిపింది. ఆ స‌మ‌యంలో అత‌డు ఛాతీ నొప్పితో తీవ్ర ఇబ్బంది ప‌డ్డాడు. రక్తపోటు నిరంతరం పెరుగుతూ వచ్చింది. ప్రశాంత్ రక్తపోటు చివరిసారిగా తనిఖీ చేసిన‌ప్పుడు 210కి చేరుకుందని వెల్ల‌డించింది.

నిహారిక తన భర్తతో బయట వేచి ఉండగా.. కేవలం టైలెనాల్ మాత్రమే ఇచ్చార‌ని, అతనికి ఎలాంటి సహాయం చేయలేదని చెప్పింది. 'వాస్తవానికి, గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రి నిర్వాహకులు, సిబ్బంది సకాలంలో వైద్య సహాయం అందించకుండా నా భర్త ప్రశాంత్ శ్రీకుమార్‌ను చంపారు' అని నిహారిక ఆసుపత్రిపై ఆరోపించింది.

గ్రే నన్స్ ఆసుపత్రిని నిర్వహించే యాజ‌మాన్యం.. ప్రశాంత్ శ్రీకుమార్ సంరక్షణకు సంబంధించిన విషయాలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. అయితే ఈ కేసును చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం సమీక్షిస్తోంది.

ఆసుపత్రి ప్రకటనలో 'రోగి కుటుంబానికి, స్నేహితులకు మా సానుభూతిని తెలియజేస్తున్నాము. మా రోగులు, సిబ్బంది భద్రత, సంరక్షణ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు అని పేర్కొంది.

Next Story