పరువు హత్య.. ఆ వృత్తి ఎంచుకుందని సోదరుడే కాల్చి చంపాడు
Honour killing in Pakistan 21 year old woman shot dead by brother.ఆచారాలు, సాంప్రదాయాలు అని చెప్పి కొన్ని దేశాల్లో
By తోట వంశీ కుమార్ Published on 7 May 2022 4:19 AM GMTఆచారాలు, సాంప్రదాయాలు అని చెప్పి కొన్ని దేశాల్లో ఇంకా మహిళలను వంటింటికే పరిమితం చేస్తున్నారు. మహిళలలు తమకు నచ్చిన కెరీర్ ఎంచుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. ఓ యువతి డ్యాన్స్, మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుందని చెప్పి ఆమె సోదరుడు ఆ యువతిని కాల్చి చంపేశాడు. ఈ దారుణ ఘటన పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లాహోర్‌కు 130 కి.మీ దూరంలోని రెనాలా ఖుర్ద్ ఒకారా అనే ప్రాంతంలో సిద్రా(21) అనే యువతి తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. కాగా.. ఆ యువతికి డ్యాన్స్, మోడలింగ్ అంటే ఇష్టం. దీంతో ఫైసలాబాద్‌లో నగరంలోని థియేటర్స్‌లో డ్యాన్సర్‌గా, ఓ స్థానిక క్లాతింగ్ బ్రాండ్‌కు మోడలింగ్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అయితే.. ఇది ఆమె కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు.
ఆ యువతి ఎంచుకున్న కెరీర్.. తమ కుటుంబ సంప్రదాయానికి విరుద్దం అని, వదిలేయమని కుటుంబ సభ్యులు ఎన్నో సార్లు సిద్రాపై ఒత్తిడి తెచ్చారు. అయితే.. ఇందుకు సిద్రా ససేమీరా అని చెప్పింది. ఈద్ ను పురస్కరించుకుని తమ కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకునేందుకు సిద్రా ఫైసలాబాద్ నుంచి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో గురవారం మరోసారి కుటుంబసభ్యులు సిద్రాతో గొడవ పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో తన కెరీర్‌ను వదులుకునే పరిస్థితి లేదని సిద్రా తేల్చి చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కొట్టారు.
మరుసటి రోజు సోదరుడు హమ్జా.. సిద్రాపై కాల్పులు జరపడంతో ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బంధువులు తన సోదరి డ్యాన్స్ వీడియోను హమ్జాకు పంపడంతో.. అది చూసి కోపంలో అతడు ఈ పని చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు ఫ్రాజ్ హమీద్ అనే అధికారి చెప్పారు.