పిల్లాడిని మింగేసిన హిప్పో

Hippo Swallows 2-Year-Old In Uganda. హిప్పో పొటమస్లు చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాయి కానీ.. ఎంతో ప్రమాదకరమైనవి.

By M.S.R  Published on  16 Dec 2022 11:15 AM GMT
పిల్లాడిని మింగేసిన హిప్పో

హిప్పో పొటమస్లు చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటాయి కానీ.. ఎంతో ప్రమాదకరమైనవి. అందుకు సంబంధించిన ఉదాహరణలు ఎన్నో చూశాం. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఉగాండాలో ఒక హిప్పోపొటామస్‌ నుండి రెండేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపుగా నోట్లో ఆ రెండేళ్ల బాలుడిని పెట్టేసుకున్న హిప్పో.. అక్కడ ఉన్న వాళ్లు రాళ్లు రువ్వడంతో నోట్లో నుండి బయటకు ఉమ్మేసినట్లు క్యాపిటల్ ఎఫ్ఎమ్ ఉగాండా పోలీసులను ఉటంకిస్తూ నివేదించింది. డిసెంబర్ 4న కట్వే కబటోరో పట్టణంలోని సరస్సు ఒడ్డున తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా, హిప్పో తన భారీ దవడలతో అతనిని పట్టుకుంది.

జంతువు పిల్లాడిని పూర్తిగా మింగడానికి ప్రయత్నించగా అక్కడే ఉన్న వాళ్లు రాళ్లు విసరడంతో హిప్పో పిల్లాడిని విడిచిపెట్టింది. ఆ పిల్లాడిని ఇగా పాల్‌గా గుర్తించిన పోలీసులు, హిప్పో తలపై నుండి పట్టుకుని అతని శరీరం సగం మింగినట్లు చెప్పారు. బాలుడి చేతికి గాయాలు అయ్యాయని, తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. "బాధితుడిని వెంటనే సమీపంలోని క్లినిక్‌కి చికిత్స కోసం తరలించారు, చేతికి గాయాలు ఉన్నాయి. తదుపరి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతను పూర్తిగా కోలుకున్నాడు. రేబిస్‌కు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. " అని ఉగాండా పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో చెప్పుకొచ్చారు.




Next Story