అతడి తల మీద 58 కోట్ల రూపాయలు.. ఎలా చనిపోయాడంటే.?

బీరుట్‌పై జరిగిన వైమానిక దాడిలో హిజ్బుల్లా తీవ్రవాది, రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్‌ హతమయ్యాడు

By Medi Samrat  Published on  21 Sep 2024 5:45 AM GMT
అతడి తల మీద 58 కోట్ల రూపాయలు.. ఎలా చనిపోయాడంటే.?

బీరుట్‌పై జరిగిన వైమానిక దాడిలో హిజ్బుల్లా తీవ్రవాది, రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్‌ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది. సీనియర్ కమాండర్ల సమావేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడిలో 10 మంది ఉన్నత స్థాయి అధికారులతో సహా కనీసం 14 మంది మరణించారు. దక్షిణ బీరుట్‌లోని హిజ్బుల్లా వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో ఎత్తైన భవనం కూడా ధ్వంసమైంది. వైమానిక దాడికి ప్రతిస్పందనగా, హిజ్బుల్లా ఇజ్రాయెల్ సైనిక స్థానాలపై డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించింది.

లెబనాన్‌లో వందలాది మంది అమెరికన్‌లను చంపిన 1983 బాంబు దాడుల్లో పాల్గొన్నందుకు అకిల్‌పై యునైటెడ్ స్టేట్స్ $7 మిలియన్ల బహుమతిని ప్రకటించింది. 1980లలో అమెరికన్, యూరోపియన్ ప్రజల కిడ్నాప్‌లో అకిల్ భాగమై ఉన్నాడు. అకిల్ మరణం హిజ్బుల్లా నాయకత్వానికి తీవ్రమైన దెబ్బ అని చెప్పొచ్చు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో సీనియర్ హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ మరణించిన కొన్ని వారాల తర్వాత ఇబ్రహీం అకిల్‌ కూడా మరణించాడు.

ఇజ్రాయెల్‌పై తదుపరి దాడులను ప్లాన్ చేయడానికి ఇతర కమాండర్‌లతో సమావేశమైనప్పుడు అకిల్ ను చంపామని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఉత్తర ఇజ్రాయెల్ భూభాగాలపై దాడి చేయాలని అకిల్ ప్రణాళికలు రచిస్తూ ఉండగా ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది.

Next Story