అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి

Gunfire in America again.. Four dead. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

By అంజి
Published on : 29 Aug 2022 8:25 AM IST

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా హతం అయ్యాడు. టెక్సాస్‌లో హూస్టన్‌లో అమెరికా కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. హూస్టన్‌ సిటీలోని ఓ ఇంటికి దుండగుడు నిప్పు పెట్టాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న వారు బయటకు పరుగులు తీశారు. నివాసితులు బయటకు వచ్చే వరకు వేచి ఉండి వారిపై కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక శాఖ మొదట సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పింది

అయితే తాము జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడని సిటీ పోలీస్‌ చీఫ్‌ ట్రాయ్‌ ఫిన్నర్‌ తెలిపారు. దీంతో మొత్తం నలుగురు మృతిచెందారని వెల్లడించారు. బాధితులంతా 40 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్కులేనని చెప్పారు. నిందితుడు 40 ఏళ్ల ఆఫ్రికన్‌-అమెరికన్‌ వ్యక్తి అని, పూర్తిగా నలుపు దుస్తులు ధరించి ఉన్నాడన్నారు. కాగా, ఈ నెల 24న మేరీల్యాండ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని మృతి చెందాడు.

Next Story