భారత్ ను ప్రశంసల్లో ముంచెత్తిన బిల్ గేట్స్
Great to see India's leadership in scientific innovation. భారత్ మీద ఎంతో నమ్మకం ఉన్న మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ కరోనా వాక్సిన్ తయారీలో భారత్ ని ప్రశంసల్లో ముంచెత్తారు.
By Medi Samrat Published on 5 Jan 2021 5:46 PM ISTభారత్ మీద ఎంతో నమ్మకం ఉన్న పారిశ్రామిక వేత్తల్లో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కూడా ఒకరు. కరోనా వ్యాక్సిన్ల తయారీ సమయంలోనే బిల్ గేట్స్ భారత్ మీద ఎంతో నమ్మకం ఉంచి.. భారత్ ప్రపంచానికి మార్గదర్శి అవుతుందని అన్నారు. అనుకున్నట్లుగానే భారత్ దగ్గర రెండు కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయి. రెండు కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు మంజూరు అవ్వడంతో బిల్ గేట్స్ భారత్ పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణల రంగంలోనూ, కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యంలోనూ భారత్ అగ్రగామిగా నిలుస్తున్న తీరు అభినందనీయం అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు యావత్ ప్రపంచం చేస్తున్న కృషికి భారత్ నాయకత్వం వహిస్తున్న తీరు అమోఘం అని బిల్ గేట్స్ ట్వీట్ చేశారు. కొవాగ్జిన్ (భారత్ బయోటెక్-ఐసీఎంఆర్), కొవిషీల్డ్ (ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా) వ్యాక్సిన్లకు డీసీజీఐ ఆఖరి అనుమతులు కూడా ఇవ్వడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు.
ఆ మీడియా కథనాన్ని కూడా బిల్ గేట్స్ తన ట్వీట్ లో పంచుకున్నారు. కరోనాను ఈ ప్రపంచం నుంచి పారద్రోలాలన్న లక్ష్యాన్ని నిజం చేసే క్రమంలో భారత్ ప్రముఖ పాత్ర పోషించనుందని గేట్స్ చెప్పుకొచ్చారు. వ్యాక్సిన్ ఉత్పత్తి రంగంలో మిగతా ప్రపంచానికి దారిచూపే స్థానంలో భారత్ ఉందని అన్నారు.
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కరోనా వివరాల ప్రకారం భారతదేశంలో గత 24 గంటల్లో 16,375 మందికి కరోనా నిర్ధారణ అయింది. 29,091 మంది కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,56,845కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 201 మంది కరోనా కారణంగా మృతి చెందారు. భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య 1,49,850కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,75,958 మంది కోలుకున్నారు. 2,31,036 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.