అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధిలో.. తొలి డిప్యూటీ ఎండీగా గీతా గోపినాథ్‌

Gita Gopinath to take on new role at IMF as First Deputy Managing Director. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)లో ఆర్థికవేత్త, భారతీయ-అమెరికన్ గీతా గోపీనాథ్.. మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందింది.

By అంజి  Published on  3 Dec 2021 12:57 PM IST
అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధిలో.. తొలి డిప్యూటీ ఎండీగా గీతా గోపినాథ్‌

అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)లో ఆర్థికవేత్త, భారతీయ-అమెరికన్ గీతా గోపీనాథ్.. మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందింది. త్వరలో ఆమె ఈ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. ఆ తర్వాత గీతా గోపినాథ్‌ కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐఎంఫ్‌లో గీతా గోపినాథ్‌ చీఫ్‌ ఎకానమిస్ట్‌గా పని చేసేవారు. వచ్చే ఏడాది జాఫ్రీ ఒకామోటో.. ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఎండీ బాధ్యతల నుండి వైదొలగనున్నారు. వాస్తవానికి జనవరి 2022లో గీతా గోపినాథ్‌ పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తిరిగి పాఠాలు చెబుకుంటారని అంతా భావించారు. ఐఎంఎఫ్‌ డైరెక్టర్‌ క్రిస్టలినా జార్జీవ సూచన మేరకు గీతా గోపినాథ్.. డిప్యూటీ ఎండీ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు.

"జాఫ్రీ, గీత గోపినాథ్‌లు ఇద్దరూ అద్భుతమైన సహోద్యోగులు - జాఫ్రీ వెళ్ళడం నాకు చాలా బాధగా ఉంది. అయితే అదే సమయంలో గీత గోపినాథ్‌ ఎఫ్‌డీఎండీ అనే కొత్త బాధ్యతను స్వీకరించాలని నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను" అని ఐఎంఎఫ్‌ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. జార్జివా మాట్లాడుతూ.. ఐఎంఎఫ్‌కు గీతా గోపీనాథ్ అందించిన సహకారం ఇప్పటికే అసాధారణమైనదని అన్నారు. ఆమె మేధో నాయకత్వం మన జీవితంలోని అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఐఎంఎఫ్‌కు ఎంతో సాయం చేసిందన్నారు. ఐఎంఎఫ్‌ చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనామిస్ట్ అయిన శ్రీమతి గోపీనాథ్ - సభ్య దేశాలు, సంస్థ అంతటా గౌరవం, ప్రశంసలను పొందారని అన్నారు.

గీతా గోపినాథ్‌ గురించి..

ఆమె 1971వ సంవత్సరంలో కోల్‌కతాలో జన్మించారు. మైసూరులో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన గీతా.. ఆ తర్వాత 1992లో ఢిల్లీలో ఎం.ఏ ఎకనామిక్స్‌ చేశారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీలో మరో సారి ఎం.ఏ ఎకనామిక్స్‌ చదివే ఛాన్స్‌ రావడంతో.. తన ఐఎఎస్‌ ప్లానింగ్‌ను పక్కన పెట్టారు. అక్కడి నుండి ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి.. చికాగో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. 2010లో హార్వర్డ్‌ యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్‌గా చేరారు. ఈ క్రమంలోనే 2018లో ఐఎంఎఫ్‌లో పని చేసే అవకాశం వచ్చింది.

Next Story