న్యూజిలాండ్ ఎంపీగా తెలుగమ్మాయి మేఘన.. చిన్న వయసులోనే..
Gaddam Meghna elected as new zealand MP. విదేశాల్లో ఎంతో మంది భారత సంతతి వారు ఉన్నత పదవులను చేపడుతూ భారత్‌కు ఎంతో పేరు తెస్తున్నారు
By అంజి Published on 16 Jan 2022 6:25 AM GMTవిదేశాల్లో ఎంతో మంది భారత సంతతి వారు ఉన్నత పదవులను చేపడుతూ భారత్‌కు ఎంతో పేరు తెస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు అమ్మాయి న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా వాల్కటో ప్రాంతం నుంచి ఎంపిక అయ్యారు. ప్రకాశం జిల్లా టంగుటూరు చెందిన గడ్డం మేఘన (18) అరుదైన గౌరవం దక్కించుకున్నారు. న్యూజిలాండ్ దేశ నామినేటెడ్ ఎంపీ పదవుల ఎంపికలో సేవ కార్యక్రమాలు, యువత విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా మేఘన ఎంపిక అయ్యారు. 2001లో మేఘన తండ్రి గడ్డం రవి కుమార్ ఉద్యోగం కోసం భార్య ఉషతో కలిసి న్యూజిలాండ్‌లో స్థిర పడ్డారు. అక్కడే పుట్టిన మేఘన.. కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్‌లో స్కూల్ పూర్తి చేశారు. మేఘన చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు.
విద్యార్థి నాయకురాలిగా ఉంటూ.. విద్యార్థుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేసేవారు. మేఘనా 'ఆల్ ట్రూజా' అనే అవార్డును కూడా గెల్చుకున్నారు. భారత సంతతికి చెందిన మేఘనను ఉత్తమ విద్యార్థినిగా.. సెయింట్ పీటర్స్ స్కూల్ గుర్తించింది. ఇది సెయింట్ పీటర్స్ స్కూల్ చరిత్రలో తొలిసారి. న్యూజిలాండ్‌కు వలస వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో ఎంతో కృషి చేస్తున్న మేఘన.. ఫ్రెండ్స్‌తో కలిసి విరాళాలు సేకరించి అనాథశ్రమాలను ఇస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన న్యూజిలాండ్ ప్రభుత్వం.. ఆమెను 'వాల్కటో' పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపిక చేసింది. వచ్చే నెలలో మేఘన పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.