మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కాపాడడం కోసం చేసిన కృషికి గాను జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారని పాకిస్థాన్ కు చెందిన ఓ గ్రూప్ తెలిపింది. పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ (PWA) గ్రూప్ సభ్యులు 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ నామినేషన్‌ను ప్రకటించారు. నార్వేలోని రాజకీయ పార్టీ పార్టియట్ సెంట్రం సభ్యులు, పాకిస్తాన్ వరల్డ్ అలయన్స్ అనే సంస్థతో కలిసి ఈ నామినేషన్ చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం గర్వంగా ఉందని పార్టియట్ సెంట్రం ఒక ప్రకటనలో తెలిపింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ అమెరికా చట్టసభ కాంగ్రెస్‌లో ఇటీవలే ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఇమ్రాన్ ఖాన్ ను ఓ రాజకీయ ఖైదీగా అమెరికా గుర్తించింది. రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నందుకు పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌పై ఆంక్షలు విధించాలని కోరారు. అమెరికా ప్రతినిధుల సభకు చెందిన జో విల్సన్, జిమ్మీ పనెట్టా ‘పాక్ డెమోక్రసీ యాక్ట్’ ని తీసుకొచ్చారు. గ్లోబల్ మ్యాగ్నిట్‌స్కీ హ్యూమన్ రైట్స్ అకౌంటబులిటీ యాక్ట్ కింద ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని పాక్ సైనిక నాయకత్వంపై ఒత్తిడి పెంచేలా వీసాపై నిషేధం విధించాలన్నారు జో విల్సన్. పాక్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఇమ్రాన్‌ను విడుదల చేయించాలని కోరారు.