భారత్ కు వెళ్లి.. వారి సొంతగడ్డపైనే ఓడించాలి: షోయబ్ అక్తర్

పాకిస్థాన్ వేదికగా 2025 లో జరిగే Champions Trophy పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

By Kalasani Durgapraveen  Published on  2 Dec 2024 6:47 AM GMT
భారత్ కు వెళ్లి.. వారి సొంతగడ్డపైనే ఓడించాలి: షోయబ్ అక్తర్

పాకిస్థాన్ వేదికగా 2025 లో జరిగే Champions Trophy పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆ దేశంలో పర్యటించేది లేదని ఇప్పటికే బీసీసీఐ (BCCI) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించడానికి ససేమిరా అంటూ వచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఎట్టకేలకు దిగి వచ్చింది. పాక్లో పర్యటించడానికి భారత్ నిరాకరిస్తున్న నేపథ్యంలో ఐసీసీ (ICC) చెప్పినట్లే ఆ జట్టు మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించేలా హైబ్రిడ్ పద్ధతికి అంగీకరిస్తామని పీసీబీ తెలిపింది. ఈ విషయంలో పాక్ బోర్డు ఓ మెలిక పెట్టింది. భవిష్యత్తులో తమ జట్టు కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్ కు వెళ్లకూడదని నిర్ణయిస్తే.. ఆ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించేలా తమకు హామీ ఇవ్వాలని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) వ్యతిరేకించాడు. ఓ క్రీడా ఛానల్ మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఆసక్తికర వ్యాఖ్య చేశాడు.

హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే ఈ టోర్నీ రెవెన్యూలో అధిక వాటాను పీసీబీ డిమాండ్ చేయడాన్ని షోయబ్ అక్తర్ సమర్థించాడు. ఇది సరైన నిర్ణయమేనని పేర్కొన్నాడు. భవిష్యత్లో ఐసీసీ ఈవెంట్ల కోసం భారత్ కు వెళ్లకూడదన్న వైఖరిపై మాత్రం అభ్యంతరం వ్యక్తంచేశాడు. వారిని సొంతగడ్డపైనే ఓడించేలా పాక్ జట్టును నిర్మించాలని కోరాడు.

మన దేశంలో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీకి వారు రావడానికి ఇష్టపడకపోతే ఎక్కువ రెవెన్యూను పంచాలన్న పీసీబీ డిమాండ్ సహేతుకమే. దీనిని మనమందరం అర్థం చేసుకుంటాం అన్నారు. భవిష్యత్లో భారత్లో ఆడే విషయంలో మనం స్నేహ హస్తం చాచాలి.. అక్కడికి వెళ్లాలి.. భారత్ కు వెళ్లి.. వారిని సొంతగడ్డపైనే ఓడించాలన్నారు.

Next Story