వరదల బీభత్సం.. 14 మంది మృతి
తుర్కియేలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు సంభవించి 14 మందికి పైగా మరణించారు
By తోట వంశీ కుమార్ Published on 16 March 2023 8:59 AM IST
వీధుల్లో వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యం
భూకంపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తుర్కియేను వరదలు వణికిస్తున్నాయి. అడియామాన్, సాన్‌లియుర్ఫా ప్రావిన్స్‌లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు సంభవించి కనీసం 14 మంది మృతి చెందగా, వేలాది మంది కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇంకొందరు గల్లంతు అయ్యారు.
సిరియా సరిహద్దుకు ఉత్తరాన 50కిమీ (30 మైళ్లు) దూరంలో ఉన్న సాన్‌లియుర్ఫాలో వరదల కారణంగా 11 మంది మరణించారని స్థానిక మీడియా తెలిపింది. ఓ అపార్టుమెంట్ దిగువ భాగం నీటితో నిండిపోయింది. బేస్‌మెంట్‌లో ఐదుగురు సిరియన్ జాతీయుల మృతదేహాలను కనుగొన్నారు. అండర్‌పాస్ వద్ద చిక్కుకున్న వ్యాన్ లోపల మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. మరో నలుగురు వ్యక్తులు మరణించారు.
సమీపంలోని అడియామాన్‌లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. భూకంప నిర్వాసితులైన కుటుంబం ఉంటున్న కంటైనర్ ఇల్లు వరద నీటిలో కొట్టుకుపోయింది. నలుగురు గల్లంతు అయ్యారని గవర్నర్ నుమాన్ హటిపోగ్లు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది తప్పిపోయారు.
భూకంప బాధితులు తలదాచుకుంటున్న శిబిరాలు నీటితో తడిపోయాయి. చాలా మంది ఆ గుడారాల నుంచి ఖాళీ చేయించారు. ఆస్పత్రి నుంచి రోగులను ఖాళీ చేయించారు.
ఫిబ్రవరి 6న టర్కీ మరియు సిరియాలోని కొన్ని ప్రాంతాలలో సంభవించిన శక్తివంతమైన భూకంపాల కారణంగా 52,000 మందికి పైగా మరణించారు.