అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఇటీవల వాషింగ్టన్ లో సృష్టించిన విధ్వంసాన్ని చూసి ప్రపంచం మొత్తం నివ్వెరబోయింది. అయితే ట్రంప్ మద్దతుదారులు పెద్ద ప్రణాళికతోనే విధ్వంసానికి ప్లాన్ వేసినట్లు ఎఫ్‌బీఐకి సమాచారం అందిందట..! అమెరికా లోని 50 రాష్ట్రాల్లోనూ చట్టసభల దగ్గర పెద్ద ఎత్తున అల్లర్లు, సాయుధ నిరసనలకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తమకు సమాచారం అందిందని ఎఫ్‌బీఐ హెచ్చరించింది.
జో బైడెన్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండడంతో ట్రంప్ అనుచరులు మరోసారి హింసకు పాల్పడే అవకాశాలున్నాయని అంటున్నారు. జనవరి 16 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల క్యాపిటల్స్ వద్ద నిరసనలకు దిగడానికి వ్యూహరచన చేశారని.. ఇక జనవరి 20న బైడెన్ ప్రమాణస్వీకార మహోత్సవం నాడు వాషింగ్టన్‌లో భారీ ప్రదర్శన నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఎఫ్‌బీఐ వద్ద సమాచారం ఉందని అమెరికా మీడియా తెలిపింది.
జో బైడెన్ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజధాని వాషింగ్టన్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఎమర్జెన్సీ జనవరి 24వరకు కొనసాగుతుందని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎమర్జెన్సీ సమయంలో స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్), ఫెడరల్ ఎమెర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ఫెమా) సహాయ చర్యల్లో నిమగ్నమై ఉంటాయి.